పవర్‌హౌజ్ వద్దే ప్రమాదకరంగా..
కనిపించని హెచ్చరికలు..
అమరచింత: పర్యాటకులను ఆకర్షించే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ప్రాజెక్టు రహదారిపై ఏర్పాటు చేసిన భారీ స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు యమపాశాలుగా మారుతున్నాయి. వాటికి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, తెలుపు–నలుపు చారలు లేదా రేడియం పెయింటింగ్ చేయకపోవడం, రాత్రివేళల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు వాటిని గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా బైక్‌లపై వచ్చే యువత వేగంగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది. రెండేళ్లలో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రెండేళ్లలో ముగ్గురు మృతి
జూరాల అందాలను వీక్షించేందుకు ప్రతి వర్షాకాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి భారీగా సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతుంది. గతేడాది జూలై 20న జూరాల అందాలను చూసేందుకు వచ్చిన యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారును తప్పించుకునే క్రమంలో వాహనం అదుపుతప్పి నదిలో పడటంతో మహేష్ అనే యువకుడు మృతి చెందాడు.
● తాజాగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్ మండలాలకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై జూరాల ప్రాజెక్టుకు వచ్చారు. వేగంగా వెళ్తున్న సమయంలో ముందున్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించకపోవడంతో బైక్ అదుపుతప్పి ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడి మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రూ.30 లక్షల దీపాలదీ ఇదే పరిస్థితి!
పర్యాటకుల భద్రత కోసం ప్రాజెక్టుపై సుమారు రూ.30 లక్షల వ్యయంతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా వెలగడం లేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో ప్రాజెక్టు రహదారి చీకటిమయంగా మారడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. స్పీడ్ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రేడియం పెయింటింగ్ వేయడం, రహదారిపై విద్యుత్ దీపాలు నిరంతరం పనిచేసేలా చూడటం వంటి కనీస భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
బాధ్యత ఎవరిది?
స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు తమ పరిధిలో లేదని.. పవర్ ప్రాజెక్టు అధికారులే వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అయితే ఎవరి పరిధిలో ఉన్నా.. పర్యాటకుల భద్రతకు సంబంధించిన అంశాలపై సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని వారు అంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణతో పాటు పర్యాటకుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదకర స్పీడ్ బ్రేకర్ల వద్ద వెంటనే హెచ్చరిక బోర్డులు, రేడియం మార్కింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ దీపాలను పునరుద్ధరించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రాణం పోయే వరకు అధికారులు ఎదురుచూడకుండా ఇప్పటికై నా భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
జూరాల ప్రాజెక్టుపై జలవిద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే ఆరు యూనిట్ల గేట్ల వద్ద బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన పైపుల భద్రత కోసం భారీ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. పగటిపూట సైతం వాహనదారులు అప్రమత్తంగా ఉంటేనే వాటిని గుర్తించే పరిస్థితి ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇక రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. రహదారిపై విద్యుత్ దీపాలు సరిగా వెలగకపోవడంతో చీకటిలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు స్పీడ్ బ్రేకర్లను గుర్తించలేక అదుపుతప్పుతున్నారు. కొందరు కిందపడి గాయాలపాలవుతున్నారు. మరికొందరు అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.
యమపాశంగా మారిన స్పీడ్ బ్రేకర్లు..
ర్యాష్ డ్రైవింగ్‌తో ఎగిరిపడుతున్న
వాహనదారులు
తాజాగా ఇద్దరు యువకులు మృతి..
మరొకరి పరిస్థితి విషమం
సూచిక బోర్డులు, రేడియం
పెయింటింగ్ లేక ప్రమాదాలు
స్పీడ్ బ్రేకర్లు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. జూరాల ప్రాజెక్టుపై అవి కనిపించడం లేదని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్లపై తెలుపు–నలుపు చారల పెయింటింగ్ లేదా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసినా రాత్రివేళల్లో వాహనదారులకు అవి కనిపించే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


