● సీజ్ చేసిన ఇసుకను రాత్రికి రాత్రే చదును చేసిన మాఫియా
● ప్రభుత్వానికి రూ.79.14 లక్షల నష్టం
● ఇద్దరిపై ఫిర్యాదు.. కేసు నమోదు
మిడ్జిల్: వేలం వేయాల్సిన సీజ్ చేసిన ఇసుక డంప్‌ను రాత్రికి రాత్రే చదును చేసి మట్టితో కప్పివేయడం కలకలం రేపింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి సమీపంలోని దుందుభీ వాగు వద్ద పట్టా భూమిలో అనుమతులు లేకుండా డంప్ చేసిన 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు గతంలో సీజ్ చేశారు. గురువారం దానిని వేలం వేసేందుకు 23 మంది పోటీదారులు సిద్ధమయ్యారు. అయితే మంగళవారం రాత్రి ఇసుక డంప్‌ను భూమి యజమానులు చంద్రశేఖర్, ఎం.బాలకృష్ణారెడ్డి చదును చేసి మట్టితో కప్పివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. సీజ్ చేసిన ఇసుకను నిబంధనల ప్రకారం వేలం ద్వారా విక్రయించాల్సి ఉండగా డంప్‌ను మాయం చేయడంతో ప్రభుత్వానికి రూ.79.14 లక్షల నష్టం వాటిల్లినట్లు తహసీల్దార్ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇద్దరిపై మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తహసీల్దార్, మైనింగ్ అధికారుల పంచనామా ఆధారంగా ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


