అలంపూర్: ఐదో శక్తిపీఠం జోగుళాంబ అమ్మ వారి ఆలయంలో మండల మహోత్సవ పూజ లు గురువారంతో ముగిశాయి. అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపనను పురస్కరించుకొని మూడు రోజులపాటు అవాహిత దేవత పూజలు, హోమాలు విశేషంగా నిర్వహించారు. చివరిరోజు యాగశాలలో అర్చకులు హోమా లు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. శ్రీచక్రానికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులు తమ గోత్రనామాలతో పూజలు నిర్వహించుకోనే అవకాశం కలుగనున్నట్లు అర్చకస్వాములు తెలిపారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గంగాపురంలో
పవిత్రోత్సవాలు
జడ్చర్ల టౌన్: గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ఈనెల 26 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ దీప్తిరెడ్డి తెలిపారు. మొదటి రోజు రాత్రి అంకురార్పణ, వేదారంభం, నిత్యహోమం నిర్వహిస్తారు. రెండో రోజు మూర్తికుంభ స్థాపన, నిత్యహోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయి. మూడో రోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అష్టోత్తర శతకలశాభిషేకం, నిత్యహోమం, పూర్ణాహుతి, మూర్తికుంభ సంప్రోక్షణ, తీర్థప్రసాద వితరణ నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో సామూహిక లక్ష్మీపూజ నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.


