మహబూబ్‌నగర్ క్రీడలు: కరాటేలో అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని ఏకేఎఫ్, డబ్ల్యూకేఎఫ్ రెఫరీ టి.కనకరాజు, ఏకేఎఫ్ రెఫరీ జె.ప్రవీణ్‌కుమార్, సీనియర్ మాస్టర్ విజయ్‌కుమార్ అన్నారు. జీకే మాస్టర్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్‌క్రాస్ భవన్‌లో కుమితే, రెఫరీపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమితే పోటీల నిర్వహణ, రెఫరీ నిర్ణయాల ప్రక్రియ, పోటీ సమయంలో పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే క్రీడలో కుమితే విభాగానికి సంబంధించిన నియమాలు, రెఫరీ విధులు, విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. కరాటే క్రీడను మరింత శాసీ్త్రయంగా, నైపుణ్యపరంగా అభివృద్ధి చేయడంతోపాటు రెఫరీలు, కోచ్‌లలో ఆధునిక పోటీ నియమాలపై అవగాహన కల్పించడమే సెమినార్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కరాటేలో నైపుణ్యాల పెంపునకు ఇలాంటి శిక్షణలు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జీకే మాస్టర్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఫౌండర్ కృష్ణయ్య, చైర్మన్, ఎగ్జామినర్ రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.


