సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ యువకుడు మృతి

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

కేటీదొడ్డి: సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలకుంటకు చెందిన హరిజన హనుమంతు (28) ఆదివారం సాయంత్రం ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. స్ధానికులు గమనించి గద్వాలలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య కవితతో పాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న యువకుడు మృతి చెందడంతో భార్య చిన్నారుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాసులుని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు.

పాముకాటుకు గురైన బాలుడు

అమరచింత: పట్టణంలోని రాజవళీ దర్గా పార్కులో ఆడుకుంటున్న బాలుడు పాల్గుణ ఆదివారం పాముకాటుకు గురయ్యాడు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన పాల్గుణ ప్రభుత్వ డీఎంఆర్‌ఎం ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి పార్కులో ఆడుకుంటుండగా గడ్డి మొక్కల మధ్య ఉన్న పాము పాల్గుణ కాలుపై కాటువేసింది. గమనించిన తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పాముకాటుకు విరుగుడుగా యాంటి వీనమ్‌ ఇంజక్షన్‌ ఇచ్చి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు స్పందించి పార్కులో పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి పాముల బెడద నుంచి కాపాడాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

పోలేపల్లి సెజ్‌లో కార్మికుడి దుర్మరణం

జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి సెజ్‌లోని పారిశ్రామిక వాడలో ఓ పరిశ్రమలో ఆదివారం కార్మికుడు దుర్మరణం చెందాడు. సీఐ కథనం మేరకు.. సుప్రీం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు ఆనంద్‌ సేనాపతి(35) పనులు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పరిశ్రమలో బరువులు ఎత్తే యంత్రం ఢీకొని మరో గూడ్స్‌ మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వైద్య చికిత్స కోసం అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

ద్విచక్రవాహనాలు ఢీ.. యువకుడి మృతి

మల్దకల్‌: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని పేదొడ్డిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాలిలా... పేదొడ్డి గ్రామానికి చెందిన బొప్పల స్వామి (28) మల్దకల్‌లో సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. రోజులాగే శనివారం రాత్రి దుకాణం మూసివేసి, ద్విచక్రవాహనంపై గ్రామానికి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న స్వామి ద్విచక్రవాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్రగాయాలు కాగా గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూవృద్ధురాలి మృతి

మక్తల్‌: చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని మాద్వార్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మ్యాకలి సత్యమ్మ (80) మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో ఈనెల 6న ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగడంతో కుటుంబసభ్యులు వెంటనే మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై మృతురాలి కోడలు మల్లమ్మ ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement