మహబూబ్‌నగర్ క్రీడలు: నగరంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఓపెన్ టూ ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఆదివారం ముగిసింది. డబుల్స్ విభాగంలో మ్యాచ్‌లు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భాను– జోయల్ 21– 18, 19– 21, 21– 14 తేడాతో సయ్యద్ ఎజాస్– జీషాన్‌పై గెలుపొంది విజేతగా నిలిచారు. అదేవిధంగా మూడోస్థానంలో అనిల్– శివ, నాలుగో స్థానంలో అబ్దుల్ రహెమాన్– వెంకటప్ప నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులకు నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు శ్యామూల్ ట్రోఫీలు అందజేశారు. అలాగే బ్యాడ్మింటన్ ఆడిన చిన్నారులు ఎల్.హాన్విక్, యశ్వంత్‌లకు ప్రోత్సాహకంగా మెడల్స్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, ఉదయ్‌రెడ్డి, నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


