గుట్టుగా గుప్తనిధుల వ్యవహారం | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా గుప్తనిధుల వ్యవహారం

Aug 11 2026 1:36 AM | Updated on Aug 11 2026 1:36 AM

ముందుకు సాగని దర్యాప్తు

52 నాణేలు, రెండు ముక్కల బంగారం మాత్రమే రికవరీ

కేసు నుంచి విముక్తికి డబ్బుల వసూలు

గట్టు: గట్టులో లభించిన గుప్తనిధుల గుట్టు ఇప్పటికీ గుట్టుగానే మిగిలిపోయింది. గట్టులోని నేతాజీ సర్కిల్‌ సమీపంలో ఓ పాత ఇంటి గోడను కూల్చే క్రమంలో కూలీలకు గుప్త నిధులు లభించాయి. వీటిని పంచుకునే క్రమంలో తేడాలు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గుప్త నిధులు లభించిన కూలీల నుంచి ఇద్దరు నాయకులు కొన్ని నాణేలు, కొంత డబ్బును తీసుకున్న వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. గుప్తనిధుల వ్యవహారం పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అధికారులు నిధానంగా తేరుకున్నారు. గట్టు గుప్తనిధుల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, లభించిన గుప్తనిధులను రికవరీ చేయాలని సర్పంచు నాగరాజు కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుప్త నిధులను దక్కించుకున్న కూలీలు 33 వెండి నాణేలతోపాటు 9.5 గ్రాముల బంగారం ముక్క, బంగారం అమ్ముకోగా వచ్చిన డబ్ముల్లో మిగిలిన రూ.లక్షను ఇంటి యజమానికి అప్పగించారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సదరు ఇంటి యజమాని నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం అనుమానితులను గద్వాల సీఐ శ్రీను గట్టు పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించగా మరో 21వెండి నాణేలు, బంగారం ముక్కను రికవరీ చేశారు. ఇలా మొత్తం 72 నాణేల్లో 54 నాణేలు, రెండు బంగారం ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని కూలీలు దర్జాగా అమ్ముకుని వచ్చిన డబ్బును ఖర్చు చేసుకున్నారు. కొందరూ కూలీలు బంగారాన్ని గట్టులోనే విక్రయించగా, మరికొందరు బంగారాన్ని గద్వాల, పెబ్బేరు ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలిసింది. గద్వాల సీఐ విచారణ అనంతరం కొంత డబ్బును కూలీలు తీసుకొచ్చి ఓ నాయకుడికి అప్పగించినట్లు తెలిసింది. కేసు నుంచి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూలీలు కోరినట్లు సమాచారం. గుప్తనిధుల కేసుకు సంబంధించి ఇప్పటిదాకా మిగిలిన నాణేలు, బంగారం అమ్ముకోగా వచ్చిన డబ్బులు ఏమయ్యాయో ఎవరికీ తెలియడంలేదు. మొత్తం మీద గట్టులో లభించిన గుప్తనిధుల కేసు కొందరికి మాత్రం కాసులను కురిపించిందని గట్టులో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బిచ్చాలపేటలో..

గట్టులోని బిచ్చాల పేటలో పెద్ద ఎత్తున గుప్తనిధులు లభించినట్లు స్థానికులు చెబుతున్నారు. గుప్తనిధులను వెలికి తీయడానికి కర్నూలు ప్రాంతానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి, బిచ్చాల పేట మసీదు పక్కనే పాడుబడిన ఇంటిలో పూజలు నిర్వహించి, పెద్ద గొయ్యి తవ్వి అందులోంచి పెద్ద ఎత్తున గుప్త నిధులను బయటకు తీసినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే ఈ వ్యవహారంపై పోలీస్‌, రెవెన్యూ అధికారులు మాత్రం విస్వసించడం లేదు. ఇదంతా ఉట్టిదేనని కొట్టిపారేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement