● బంగారు ఆభరణాలు స్వాధీనం
● ఒకరు అరెస్టు.. మరోకరు పరార్
● వివరాలు వెల్లడించిన సీఐ శ్రీను
గద్వాల క్రైం: నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు ఆభరణాలను అపహరించిన నిందితులను 24గంటలోనే పోలీసులు గుర్తించి వారి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు. శుక్రవారం ఉదయం రూరల్ పోలీసు స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గద్వాల పట్టణంలోని జమ్మిచేడ్ కాలనీలో ఎలుక బుచ్చ, పారిజాతమ్మ ఈనెల 5వ తేదీన రాత్రి భోజనం అనంతరం ఇంటి ఆరుబయట నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఉప్రా, చంద్రాపురం గ్రామాలకు చెందిన ఏ–1 రితిక్ షిండే, ఏ–2 సోయొం గద్వాల జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ సామగ్రి విక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే 6వ తేదీన గురువారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు జమ్మిచేడ్ కాలనీలోని దొంగతనం చేసేందుకు వెళ్లారు. ఆరుబయట నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను పదునైన కత్తితో కత్తిరించి తస్కరించారు. ఉదయం లేచి చూడగా మెడలోని బంగారు ఆభరణాలు కన్పించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సాంకేతిక, సీసీ కెమెరాల సహాయంతో పరిశీలించగా.. ఇద్దరు నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డుమార్గంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది క్షణాల్లో తేరుకుని యువకుడిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 5గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను బాధితులకు అందజేస్తామన్నారు. కేసు ఛేదనలోని సిబ్బందికి క్యాష్ రివార్డులను అందజేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ శ్రీకాంత్, సిబ్బంది తదితరులు ఉన్నారు.


