● హన్వాడ మండలం తిర్మలగిరి గ్రామానికి చెందిన తాటిపర్తి హన్మమ్మకు గ్రామశివారులోని సర్వే నంబర్ 541లో ఒక ఎకరా లావుణి పట్టా భూమికి పట్టా సర్టిఫికెట్ ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకంలో నమోదు కాలేదు. సదరు భూమిలో కాస్తులోనూ ఉన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకంలో నమోదు చేయాలని కోరుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు.
● హన్వాడ మండలం మాదారం గ్రామానికి చెందిన పాండు అనే రైతుకు రికార్డు ప్రకారం రెండెకరాల విస్తీర్ణం ఉండాలి. పట్టాదారు పాస్‌పుస్తకంలో మాత్రం ఎకరా 38 గుంటలు నమోదైంది. దీన్ని సరిచేయాలని కోరుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకున్నారు. పరిష్కారం కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్: భూ రికార్డులు, లావాదేవీల్లో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తోంది. గతంలో ధరణి భూయాజమాన్య హక్కుల చట్టంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాన్ని రూపొందించారు. భూమి యాజమాన్య హక్కుల పాస్‌పుస్తకాల్లో చోటు చేసుకున్న తప్పులను సరి చేసుకునేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో అవకాశం కల్పించింది. కానీ భూభారతి పట్టాదారు పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు భూ యజమానులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకవైపు ప్రభుత్వ భూముల విలువలు పెరగడం.. పెరిగిన విలువలకు అనుగుణంగా చలాన్లు కట్టి తప్పుల సవరణకు దరఖాస్తులు పెట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మరోవైపు. నెలలుగా పరిష్కారం కాని సమస్యలతో సతమతమవుతూ ఇచ్చిన ఫిర్యాదులే మళ్లీమళ్లీ ఇస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్.. ఇలా ఏ కార్యాలయమైనా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో స్వీకరించే ఫిర్యాదుల్లో అగ్రభాగం భూ సమస్యలపైనే ఉండటం గమనార్హం.
కలెక్టర్, ఆర్డీఓ లాగిన్‌లో దరఖాస్తులు
జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లో 410 భూభారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పట్టాదారు పాస్‌బుక్ కరెక్షన్, పీఓబీ వంటి సమస్యలపై ఆన్‌లైన్‌లో భూ యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నీ మూడునెలలుగా ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే నంబర్, విస్తీర్ణం, మిస్సింగ్ సర్వే నంబర్, పేర్లలో తప్పులు, కులం తప్పుగా నమోదు కావడం, జెండర్ కరెక్షన్, ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగింపు వంటి అంశాలపై భూ యాజమానులు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులపై మండలస్థాయిలో విచారణలు పూర్తి చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఆర్టీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది. మూడు నెలలుగా దరఖాస్తుల పరిష్కారం కాకపోవడంతో భూ యాజమానుల్లో ఆందోళన నెలకొంది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారా.. లేక తిరస్కరిస్తారా.. అన్నది ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంది.
‘భూభారతి’లోనూ పెండింగ్ బాగోతం
మూడు నెలలుగా
పరిష్కారానికి నోచుకోని వైనం
కలెక్టర్ లాగిన్‌లో దాదాపు 410 దరఖాస్తులు
చలాన్లు కట్టినా చుక్కలే.. తప్పుల సవరణకు అష్టకష్టాలు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నభూ యాజమానులు


