మహబూబ్‌నగర్ క్రైం: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, బ్యాంకు ఖాతాలు ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ జానకి అన్నారు. సైబర్ జాగృక్తా దివస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ దొంగతనాల కంటే సైబర్ మోసాల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోషల్ మీడియా, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ యాప్, కొరియర్ ఫ్రాడ్, లోన్ యాప్, ఆన్‌లైన్ జాబ్‌ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులు ఇలా అనేక రూపాల్లో జరిగే సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలన్నారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన వీడియోలను ప్రదర్శించి.. సైబర్ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీఎస్పీ గిరికుమార్, ఎస్‌వీఎస్ ప్రిన్సిపల్ జోషి, సీఐలు గాంధీనాయక్, రాజేందర్‌రెడ్డి, కృష్ణ, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, శ్రావణ్‌కుమార్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రీ ప్రైమరీలో ఆటలు, కథలకు ప్రాధాన్యం: డీఈఓ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రీ ప్రైమరీలో బోధన కోసం ఆటలు, కథలకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఈఓ విజయకుమారి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో ఇటీవల విధుల్లో చేరిన 113 మంది ప్రీ ప్రైమరీ టీచర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చిన్నారులకు బాల్యదశలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించిందని, ప్లే బేస్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్ లెర్నింగ్ విధానాలను నేర్పించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను కేవలం శిక్షణలోనే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు కూడా నేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చదువుతో ఒత్తిడి లేకుండా తప్పకుండా కథలు, పాటలు, సంభాషన, చర్యలు, చిత్రాల వంటివి విద్యార్థులకు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, డైట్ ప్రిన్సిపల్ మేరాజుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.


