ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి

Aug 6 2026 12:57 AM | Updated on Aug 6 2026 12:57 AM

గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఎల్‌నినో జిల్లా ప్రత్యేకాధికారి వీపీ గౌతమ్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున, వాతావరణ పరిస్థితులననుసరించి వర్షాధార ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ, జిల్లా ఎల్‌నినో ప్రత్యేకాధికారి వీపీ గౌతమ్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ ఖుష్బూ గుప్తాతో కలిసి కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవన, మిషన్‌ భగీరథ, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది సాధారణం కంటే 20.5 శాతం అధిక వర్షపాతం నమోదైందని, ఈసారి 11.4 శాతం స్వల్ప లోటు ఉన్నప్పటికీ సాధారణ వర్షపాత పరిస్థితులే ఉన్నాయన్నారు. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలంటే కేవలం సూచనలు సరిపోవని, విత్తనాల లభ్యత, సబ్సిడీ, మార్కెటింగ్‌, కొనుగోలు వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. కూరగాయల సాగు కోసం మల్చింగ్‌, డ్రిప్‌, ఇతర పథకాల కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలను వివరించాలని ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణను కేవలం ఉద్యాన శాఖ బాధ్యతగా కాకుండా వ్యవసాయ శాఖ ప్రధాన బాధ్యతగా భావించాలని స్పష్టం చేశారు. అలాగే వాటర్‌ యూజర్స్‌ అసోసియేషన్లు, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి, ఈ సీజన్‌లో ఇరిగేషన్‌ నీటిని ఆశించకుండా తీర్మానాలు చేయించాలని సూచించారు.

పారదర్శకత పాటించాలి

డబుల్‌ బెడ్‌రూం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి నిజమైన అర్హులైన పేద కుటుంబాలకే ప్రాధాన్యం ఇవ్వాలని వీపీ గౌతమ్‌ అన్నారు. ఇప్పటికే పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని, రెండు పథకాల లబ్ధిదారుల జాబితాలను కృత్రిమ మేధ సాయంతో సరిపోల్చి ఒకే వ్యక్తికి రెండు పథకాలు అందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేటాయించిన ఇళ్లలో నివశించని వారికి రద్దు చేసి.. అర్హులకు కేటాయించాలని చెప్పారు. అనంతరం ఏనుగొండలోని మౌలాలి గుట్టలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను వారు పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్‌, హరిప్రియ, డీఆర్‌ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్‌, డీఏఓ గోవింద్‌నాయక్‌, ఉద్యాన వన శాఖాధికారి వేణుగోపాల్‌, గృహనిర్మాణ శాఖ పీడీ ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement