తల్లిపాలతో శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలతో శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం

Aug 2 2026 1:40 AM | Updated on Aug 2 2026 1:40 AM

పాలమూరు: తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషకాహారం ఇస్తుందని, ఆరోగ్యవంతమైన జీవితానికి తొలి పునాది అవుతుందని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా శనివారం నుంచి ఈనెల 7వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలను జనరల్‌ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగంలో కలెక్టర్‌ ప్రారంభించారు. నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు ఉపయోగపడుతుందన్నారు. శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రపాలు పట్టించాలని, దీనితో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిండంతో పాటు అనేక అంటు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని బాలింతలు, గర్భిణులకు సూచించారు. అనంతరం తల్లిపాలపై ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు, సూపరిటెంటెండెంట్‌ డాక్టర్‌ రంగా ఆజ్మీరా, జిల్లా సంక్షేమ అధికారిని జరీనా పాల్గొన్నారు.

సీపీఓగా బాధ్యతలు

స్వీకరించిన నర్సింహులు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ)గా నర్సింహులు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె.రవీందర్‌ జూలై 31న పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో గణాంక అధికారిగా విధులు నిర్వహిస్తున్న బి.నర్సింహులను సీపీఓగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్‌ ఖుష్బూగుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రణాళిక, గణాంక విభాగాల పనితీరు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నర్సింహులకు జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, గణాంక శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

టీటీడీ ఆధ్వర్యంలో

ధార్మిక కార్యక్రమాలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ నెలలో ఆధ్యాత్మిక, ధార్మిక, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం పాతపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 4 నుంచి 8 వరకు, నర్వ మండలంలోని జక్కన్నపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు భజనలు, కుంకుమపూజ, ఉపన్యాసాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఇప్పలపల్లి శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు భజనలు, ఉపన్యాసాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల భజన మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

14న వేలం పాటలు

చిన్నచింతకుంట: ఈ ఏడాది కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా వివిధ రకాల వస్తువులు, సామగ్రి విక్రయించేందుకు ఈ నెల 14వ తేదీన ఆలయం వద్ద బహిరంగవేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. లడ్డు, ప్రసాదం, కొబ్బరికాయలు, పూల దండలు, పూజ సామగ్రి, వాహన పూజ సామగ్రి, తలనీలాల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణ, దుకాణదారులకు విద్యుత్‌ లైటింగ్‌ వసతి కల్పించుట, రంగుల రాట్నం, ,ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఈ వేలం పాటలు నిర్వహించేలా దేవాదాయశాఖ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉండి ఈ వేలం పాటలలో పాల్గొన దలచినవారు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, తలనీలాలు, రంగు రాట్నం, ఎగ్జిబిషన్‌ ఏర్పాటు కోసం రూ.5లక్షల డీడీ, పూలు, పూలదండలు, టెంకాయల చిప్పల సేకరణ, విద్యుత్‌ లైటింగ్‌ వసతి కల్పించేందుకు రూ.2 లక్షల డీడీ తీసుకొని రావాలని ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement