సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి

Aug 1 2026 12:46 AM | Updated on Aug 1 2026 12:46 AM

జడ్చర్ల మున్సిపాలిటీ

పరిధిలో 3 గంటల

పాటు కలెక్టర్‌

సుడిగాలి పర్యటన

జడ్చర్ల: కలెక్టర్‌ ఖుష్బూగుప్తా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మూడు గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ గిరిజన మినీ గురుకులం, జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులను తనిఖీ చేశారు. మొదటగా తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాలకు చేరుకున్న కలెక్టర్‌ సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి పరిస్థితిని స్వయంగా గమనించారు. ఈ సందర్భంగా 4వ తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడి విషయాలు అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ ప్రకారంగా ఆహారాన్ని అందిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. దోమల సమస్య తీవ్రంగా ఉందని, కొన్ని తరగతి గదులలో ఫ్యాన్లు పనిచేయడం లేదని, కిటికీలకు తలుపులు లేవని పలువురు విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్‌ సాయంత్రంలోగా ఫ్యాన్లు ఏర్పాటుచేయాలని, కిటికీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫాగింగ్‌ చేయించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు వంట గదులను తనిఖీ చేసి భోజనం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అనంతరం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి, ప్రధాన కారిడార్‌, వార్డులు, క్యాజువాలిటీ, లేబర్‌ రూమ్‌ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి వెలుపల, లోపల ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రసూతి వార్డులో బాలింతలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో సిగ్నల్‌గడ్డ–నేతాజీ చౌరస్తా రోడ్డుపై నిర్మాణంలో ఉన్న వరద కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ నర్సింగరావు, మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష్‌కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహ్మద్‌ హర్షదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement