అలంపూర్: రైతులు ఏక పంటను సాగుచేస్తూ నష్టాలను చవి చూస్తున్నారు. అలా కాకుండా చిరుధాన్యం పంటలపై దృష్టిసారిస్తే నష్టాల బారి నుంచి బయటపడొచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి సూచించారు. అందులోను సజ్జ పంట సాగు లాభదాయకమని దీన్ని చల్లని ఆహార పంటగా చెబుతున్నారు. ఎర్రనేలల్లో పంట సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత విస్తీర్ణంలో సాగుచేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సజ్జ సాగు సస్యరక్షణ గురించి రైతులకు వివరించారు.
సజ్జ ప్రాముఖ్యత :
సజ్జ పంటను వర్షాధార, ఉష్ణ మండల ప్రాంతాల్లోనూ భూసారం తక్కువగా ఉన్న, నీటి నిల్వ శక్తి తక్కువ కలిగి ఉన్న భూముల్లోనూ సాగు చేసుకోవచ్చు. సజ్జ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. వీటి నుంచి తయారు చేసిన జావ, గంజి వంటి వాటిని తాగడం వలన మేలు జరుగుతుంది. 100 గ్రాముల సజ్జ గింజల నుంచి 361 కిలోల కేలరీల శక్తి లభిస్తోంది. అన్ని ధాన్యాల్లోకి ఇనుప ధాతువును అధికంగా కలిగి ఉండటం వలన రక్తహీనతతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సజ్జ గింజల్లో కెరొటీన్(100 గ్రాములకు 131 మి.గ్రా.) అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపునకు మేలు చేస్తోంది. ఆహార పరంగా ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా ఇటివలే సజ్జ పంటకు ప్రాధాన్యత పెరిగింది. దీన్ని సాగు చేయడం రైతులకు అన్ని విధాల లాభదాయకం.
సాగు ఇలా....!
సజ్జ సాగుకు తేలిక నుంచి మధ్య రకం ఎర్రనేలలు, నీరు ఇంకే భూములు అనుకూలం. ముందుగా ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగ కలియదున్నాలి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు 2 శాతం(20 గ్రా/లీటర్ నీటికి) ఉప్పు ద్రావణం ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన ఎర్గాట్ అనే శిలీంధ్ర అవశేషాలను వేరు చేయగలం. ఆరిన విత్తనానికి కిలోకు 3 గ్రాముల థైరామ్ లేదా ఆప్రాన్ 35 ఎస్‌డీ లేదా కాప్లాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సాళ్ల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12– 15 సెం.మీ అంటే జానెడు దూరంలో గొర్రుతో విత్తుకోవాలి.
సస్య రక్షణ : ఖరీఫ్‌లో సజ్జ పంటను వెర్రి తేనెబంక తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నాయి. తేనె బంక తెగుళ్ల నివారణకు పూతదశలో మాంకోజెట్ 2.5 గ్రాముల లీటర్ నీటికి లేదా కార్బండిజమ్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
కోత : కంకులలోని సజ్జల గింజ కింది భాగాన్ని గమనిస్తే ఒక చిన్న నల్లన్ని చుక్క కనిపిస్తోంది. మొక్కలోని అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్లు కనిపిస్తాయి. ఈ దశలో పంటను కోయాలి. పిల్ల కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది.
అంతర్ కృషి :
పంట వేసిన మొదటి 30 రోజుల వరకు పొలంలో ఏ విధమైన కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన రెండు వారాల్లోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. 25– 30 రోజుల సమయంలో గుంటక లేదా దంతితో అంతర్ కృషి చేయాలి.
మేలేన రకాలు :
అధిక దిగుబడి ఇచ్చే సూటి రకాలు ఈసీటీసీ– 8203, ఈసీఎంవీ– 231, రాజ్– 171.
హైబ్రిడ్ రకాలు :
హెచ్‌హెచ్‌బీ– 67, ఈసీఎంహెచ్– 356, ఆర్‌హెచ్‌బీ– 121, జీహెచ్‌బీ– 538, పీహెచ్‌బీ– 3, ఏబీహెచ్–1.
పాడి–పంట


