అమ్మఒడికి దూరం.. అంగట్లో పసిప్రాయం! | - | Sakshi
Sakshi News home page

అమ్మఒడికి దూరం.. అంగట్లో పసిప్రాయం!

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

టీకా కోసం వెళ్లడంతో బయటపడిన విషయం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఆర్థిక ఇబ్బందులో, లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, కన్నబిడ్డను అంగడి సరుకుగా మార్చారు ఆ దంపతులు. నలుగురు పిల్లలను పోషించే శక్తి లేదన్న నిస్సహాయత ఒక తల్లికి తన బిడ్డను దూరం చేయగా.. మగబిడ్డ కావాలన్న తపన మరో కుటుంబాన్ని చట్టవ్యతిరేక మార్గంలోకి నెట్టింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో లక్ష రూపాయలకు శిశువు రహస్యంగా చేతులు మారిన ఘటన సమాజాన్ని కలచివేసింది. ఆశా కార్యకర్త అప్రమత్తతతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో అధికారులు శిశువును రక్షించి శిశుగృహకు తరలించగా, రెండు కుటుంబాలపై జువైనెల్‌ జస్టిస్‌ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, గత నెల 16న జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మరో మగ శిశువుకు నీలమ్మ జన్మనిచ్చింది. కుటంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఆ శిశువును హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన గీత–తరుణ్‌ దంపతులకు రూ.లక్షకు రహస్యంగా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. గీత– తరుణ్‌ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉండటంతో మగబిడ్డ కోసం ఈ అక్రమానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

నాలుగో సంతానాన్ని రహస్యంగా రూ.లక్షకు విక్రయించిన దంపతులు

ఆశా కార్యకర్త అప్రమత్తతతో

వెలుగులోకి ఘటన..

జన్మించిన శిశువుకు టీకా వేయాల్సిన సమయం కావడంతో ఆశా కార్యకర్త నీలమ్మ ఇంటికి వెళ్లింది. బిడ్డ ఎక్కడని ప్రశ్నించగా.. చనిపోయాడు అని సమాధానం చెప్పింది. ఎలా చనిపోయాడని అడిగితే.. ‘పడేశాం’ అని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే గ్రామ సర్పంచ్‌ ఉషనయ్య, అంగన్‌వాడీ టీచర్‌కు సమాచారం అందించింది. వారంతా కలిసి మళ్లీ విచారించగా, బిడ్డను మునిమోక్షం గ్రామానికి చెందిన దంపతులకు అమ్మినట్లు నీలమ్మ ఒప్పుకుంది. విషయం తెలుసుకున్న డీసీపీఓ నర్మద, సీడీపీఓ రాధికలు వెంటనే మునిమోక్షం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అక్కడ శిశువు లేదని, హైదరాబాద్‌కు వెళ్తున్నామని చెప్పడంతో అధికారులు తిరిగి తెలుగుగూడెం చేరుకుని శిశువును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరిచారు.

ఐసీడీఎస్‌ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు శిశువును విక్రయించిన దంపతులు, కొనుగోలు చేసిన దంపతులపై జువైనెల్‌ జస్టిస్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. అనంతరం శిశువును జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డలోని శిశుగృహకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement