– ఆందోళన చెందిన విద్యార్థినులు
గద్వాల క్రైం: స్థానిక మదర్సాలోకి ముగ్గురు ఆకతాయిలు చొరబడి విద్యార్థినులను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన ఘటన ఆదివారం మధ్యాహ్నం పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ చోటు చేసుకుంది. స్థానికులు, విద్యార్థినుల కథనం మేరకు.. ఉర్ధూ మదర్సాలో వేర్వేరు వర్గాలకు చెందిన వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలపై కొన్ని రోజులుగా తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. ఆర్థికపరమైన వాటికి సరైన లెక్కలు చూపడం లేదని ఘర్షణకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యంగా మదర్సాలోకి చొరబడి ఈ ట్రస్టుకు సంబంధించిన వ్యక్తులమని వారితో వివాదస్పదంగా మాట్లాడారు. అనుమతి లేకుండా లోపలికి రావడం భావ్యం కాదని విద్యార్థినులు చెప్పే ప్రయత్నం చేసిన క్రమంలో వారిని భయబ్రాంతులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న మహిళా బోధన సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ మూడో ఎస్‌ఐ జహాంగీర్ అక్కడకి చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత ట్రస్టు నిర్వాహకులు లేదా పోలీసు, న్యాయ నిపుణుల సమక్షంలో పరిష్కారం చేసుకోవాలని, అకారణంగా మదర్సాలోకి చొరబడడంపై సరికాదన్నారు. జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. మదర్సాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ట్రస్టు నిర్వాహకులు మోసాలకు పాల్పడినట్లు ఏవైన ఆధారాలు ఉంటే పోలీసులకు అందజేయాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


