ఫెయిలైతే.. ఆత్మహత్య ఆలోచన వద్దు | - | Sakshi
Sakshi News home page

ఫెయిలైతే.. ఆత్మహత్య ఆలోచన వద్దు

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

హద్దు దాటుతున్నారిలా.. తల్లిదండ్రులు తిడతారనే భయం.. జీవితంలో గెలవాలి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తుంచేయాలి

ఉత్తీర్ణత కాకపోతే ఒత్తిడిలోకి వెళ్తున్న విద్యార్థులు

మార్కులే ప్రామాణికం కాదు..

ఒడిదొడుకులను అధిగమిస్తేనే

జీవితంలో గెలుపు

ఎలాంటి చదువులోనైనా ఒత్తిడి

సహజమేనంటున్న నిపుణులు

ఇటీవల ఉమ్మడి జిల్లాలో

పెరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు

నేడు మారుతున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులంతా కష్టనష్టాలను భరిస్తూ వారి పిల్లలను ఉన్నత చదువుల కోసం నగరానికి, పట్టణానికి పంపిస్తున్నారు. ఎన్నో ఆశలతో, ఉన్నత లక్ష్యాలతో ఉత్సాహంగా వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న యువతలో కొంత మంది వారి తప్పుతున్నారు. చదువు నుంచి నైతిక విలువలు నేర్చుకోకపోవడం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులు చెడిపోవడానికి కారణమవుతున్నాయి. మరి కొంతమంది విద్యార్థులు తాత్కాలిక ఆనందాల కోసం స్నేహితుల మాయలో పడి దారితుప్పుతూ చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువమంది తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నా వారే కన్పిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇంటర్‌..లేదా పదో తరగతి ఇతర కోర్సుల్లో అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని టీనేజర్స్‌ ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ తనువుచాలిస్తున్నారు. చాలామంది విద్యార్థులు వ్యక్తిగతంగా లక్ష్యంగా పెట్టుకున్న మార్కులు రాలేదని.. ఆత్మహత్యలకు పాల్పడటం విశేషం. జిల్లాలో ఆదివారం ఇంటర్‌ ఫలితాలు రావడంతో భూత్పూర్‌ మండ లం అన్నసాగర్‌కు చెందిన శ్రావణి(17) ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు ఏటా జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.

విషయం చిన్నదే అయినా

చదువుల్లో వెనుకబాటుతోపాటు ఆశించిన మార్కు లు సాధించలేమనే కారణాలతో బలవన్మరణం చెందుతున్న విద్యార్థులెందరో ఉన్నారు. ప్రవేశ పరీక్షలో విఫలమయ్యానని, పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాలేదని..ఆ కళాశాలలో వాతావరణం బాగా లేదని.. లెక్చరర్స్‌ తిట్టారని.. ఫోన్‌ మాట్లాడుతుంటే ఇంట్లో అమ్మనాన్న మందలించారని ఇలా చిన్నచిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యంగా ఐఐటీ వంటి విద్యాసంస్థల్లో చదువుతున్న వారితో కార్పోరేట్‌ సంస్థల్లో ఇంటర్‌ చదువుతున్న వారిలో 28నుంచి 30శాతం మంది చదువులో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థి దశలో 13–20ఏళ్లలోపు వారు ఎక్కువగా మరణిస్తున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కలను బహిర్గతం చేసింది. ఈ తరహా ఆత్మహత్యలు మన జిల్లాలోను ఏడాదికి పదుల సంఖ్యలో ఉంటున్నాయి.

నేను ఎంచుకున్న ల క్ష్యంలో ముందుకు వె ళ్లలేకపోతున్నాను.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ స భ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మారణాలకు సిద్ధమవుతారని అంతకుముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటా రు. ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచనలు చేస్తుంటారు. చిన్నచిన్న విషయాలకు ఏడుస్తుంటారు. నేను లేకపోయిన మీరు బాగుండాలనే మాటలు నోటినుంచి వస్తుంటాయి. తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగరు. ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందనే చర్చలు జరుపుతుంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరునెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం. ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి.

– డాక్టర్‌ అనిల్‌రాజ్‌,

మానసిక వైద్యనిపుణుడు

ప్రతివ్యక్తి జీవితంలో గెలవాలంటే అన్నింటికన్నా ముందు మానసిక పరిపక్వత చాలా అవసరం. చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు ఒడిదొడుకులు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వచ్చి ఆకారణంగా చిన్న విషయంలో ఒంటరి వారమవుతున్నారు. ప్రతి విషయాన్ని ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే గెలుపు మన పక్కనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓటమి కూడా మనసు పలకరిస్తుంటుంది. జీవితమంటే గెలుపొటముల సంగమం అన్ని గ్రహిస్తే కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోటి మొక్కులు మొక్కే మన తల్లిదండ్రులు, అక్కాచెల్లెలు, అన్నదమ్ములు ఇలా మన వెనక గెలుపు చూడాలని తాపత్రయపడే వారు చాలామంది ఉంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం జీవితాన్ని ధారబోసే తల్లిదండ్రులుంటారు. జీవితం ఒక మనకే పరిమితం కాదు. చాలా బంధాలు, బాంధవ్యాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి.మనపై ఆధారపడ్డవారి గురించి ఆలోచించాలి..మనం ఎదగడంలో ఉద్యోగం సాధించడంలో వారి పాత్ర ఉందని మన ఎదుగుదలకు వారి ఉపయోగపడాలనే ఆలోచన మదిలో మెదలాలి.

అభివృద్ది చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో మానసిక జబ్బులపై ప్రజలకు సదవగాహన లేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి కూడా తక్కువే. ఆ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రతి ఒక్కరికీ వచ్చే ఆలోచన ఆత్మహత్య చేసుకోవడం..ఇలాంటి ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలి. విద్యార్థుల మీద వాస్తవానికి ఒత్తిడి బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఆత్మహత్యలకు దారితీస్తోంది. నేడు ఏమి చేయలేనన్న భావనను మనసులోంచి తీసేయాలి. ఆత్మహత్య చేసుకుందామనుకున్న వారిలో రెగ్యులర్‌గా ఉండే కంటే భిన్నంగా కనిపిస్తారు. మాటతీరులో మార్పు, నిద్రపోరు, తినడం మానేస్తారు. ఇష్టమున్న పనులకు దూరంగా ఉంటారు. వీటిని గమనించి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తే ప్రయోజనం ఉంటుంది.

– వంగీపురం శ్రీనాథాచారి, ప్రముఖ మానిసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement