● అన్ని హంగులతో పట్టణం
నడిబొడ్డున నిర్మాణం
● మౌలిక సౌకర్యాలతో
కార్యాలయం ఏర్పాటు
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయానికి సంబంధించిన పక్కా భవనం అన్ని హంగులతో ముస్తాబైంది. మున్సిపాలిటీగా ఆవిర్భావం అయినప్పటి నుంచి పక్కా భవనం లేకపోవడంతో అటు ప్రజలకు ఇటు అధికారులు, సిబ్బందికి ఇబ్బందిగా ఉండేది. పూర్వపు బాదేపల్లి గ్రామ పంచాయతీ భవనంలో కొన్నేండ్ల పాటు మున్సిపాలిటీ కొనసాగినా అది శిథిలావస్థకు చేరడంతో కావేరమ్మపేటలోని గ్రామ పంచాయతీ భవనంలోకి తరలించారు. అయితే అక్కడి కార్యాలయం పట్టణ ప్రజలకు దూరంగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బాదేపల్లిలో శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ భవనాలను కూల్చివేసి అదే స్థలంలోనే కొత్తగా మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
మౌలిక సౌకర్యాల కల్పన
నూతన కార్యాలయంలో కమిషనర్, చైర్మన్, తదితర పాలకమండలి సభ్యులకు సౌకర్య వంతంగా గదులను తీర్చిదిద్దారు. సమావేశాల నిర్వహణకు కూడా వీలుగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పలు విభాగాలకు సంబంధించి ప్రజలకు సేవలు అందించే విధంగా విభాగాల వారిగా గదులు నిర్మించారు. పట్టణ మహిళా సంఘాలకు సంబంధించి సమావేశాల నిర్వహణకు కూడా ఓ హాలు నిర్మాణం చేపట్టారు. చాంబర్‌లకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించారు. కార్యాలయం మధ్యలో అహ్లాదకరం, అందంగా కనిపించే విధంగా మొక్కల పెంపకానికి వీలుగా ఖాళీ స్థలాన్ని విడిచారు. గాలి వెలుతురు వచ్చే విధంగా భవన నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఇప్పటి వరకు పట్టణంలో ఉన్న ప్రభుత్వ భవనాలలో ఓ అందమైన భవనం ఉందంటే అది పురపాలిక కార్యాలయం నూతన భవనమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అన్ని పనులు పూర్తయ్యాయి
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ప్రహరీ, సీసీ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఆయా పనులు పూర్తి చేసి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆదేశాల మేరకు భవన ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం.
–లక్ష్మారెడ్డి, కమిషనర్, జడ్చర్ల మున్సిపాలిటీ


