● పూజలు, దర్శనాలకు తాత్కాలిక విరామం
● నేడు ఉదయం 9 గంటలకు తిరిగి దర్శనాలు
అలంపూర్: కేతుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో పూజలకు, దర్శనాలకు ఆలయాల్లో తాత్కాలిక విరామమిచ్చారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీజోగుళాంబ అమ్మవారి శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల అనంతరం కేతుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం కావడంతో దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల తలుపులను అర్చకులు మూసివేశారు. బాలబ్రహ్మేశ్వర స్వామివారి దర్శనం నిలిపేశారు. ఈ సందర్భంగా ఈఓ దీప్తి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రగ్రహణం ఉండటంతో అర్చకుల సూచనల మేర కు ఆలయాల్లో పూజలు, దర్శనాలకు తాత్కాలిక వి రామం ఇచ్చినట్లు తెలిపారు. బుధవారం ఉదయం తిరిగి ఆలయాల్లో శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వామి, అమ్మవారికి మహా మంగళహారతి అందించనున్నారు. అనంతరం ఉద యం 9గంటలకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తా మని వెల్లడించారు. పూజా కార్యక్రమాలు యథాతధంగా కొనసాగనున్నట్లు తెలిపారు. శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని జరిగే చండీహోమాలు సైతం గ్రహణం కారణంగా నిర్వహించలేదని ఈఓ తెలిపారు.
మన్యంకొండ ఆలయం మూసివేత
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని గ్రహణ, పూర్వ పద్ధతుల ప్రకారం మంగళవారం తాత్కాలికంగా మూసివేశారు. భక్తులందరికీ ఈ సమయంలో దర్శనం, సేవలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత అర్చకులు శుద్ధి చేసి, సంప్రోక్షణం నిర్వహించారు. అనంతరం అర్చకులు మాత్రమే దేవస్థానంలో పూజలను పునఃప్రారంభించారు.
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో స్వామివారికి శ్రీవారి సేవ, రథాంగహోమం, గజవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం మూసివేశారు. రాత్రి 8 గంటలకు ఆలయ శుద్ధి చేసి పుణ్యాహవాణం, అభిషేకాలు జరిపించినట్లు అర్చకులు తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే రథోత్సవానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ శేఖర్‌గౌడ్ వివరించారు.
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి, కోదండరామస్వామి, శివాలయాలను అధికారులు మూసివేశారు. సాయంత్రం 7 గంటల కు సంప్రోక్షణ, పుణ్యహవచనం, పంచామృత అభి షేకాలను నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
దేవరకద్ర: పట్టణంలోని శివాలయం, వీరప్పయ్య స్వామి, ప్రసన్న ఆంజనేయస్వామి, చెన్నకేశవ స్వామి, పోచమ్మ దేవత దేవాలయాలతో పాటు మండలంలోని చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసిఉంచినట్లు అర్చకులు తెలిపారు.
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. ఆలయంలో సంప్రోక్షణ జరిపిన అనంతరం బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తిరెడ్డి తెలియజేశారు.


