వరిలో జింకు లోపం..
అలంపూర్: నీటి వసతి ఉన్న రైతులు రబీ సీజన్‌లో వరి సాగుపై మొగ్గు చూపుతారు. అయితే పంట ఏపుగా పెరగడానికి నేలలో జింకు ధాతువు లోపం ఉండకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియ నాయక్ రైతులకు సూచిస్తున్నారు. అలాగే అధిక దిగుబడులు ఇచ్చే రకాలు సాగు చేయడం, సంవత్సరానికి రెండు పంటలు పండించడం, నత్రజని, భాస్వరం, పోటాష్ ఎరువులను వాడటం వలన జింకు లోపాన్ని తగ్గించవచ్చని వివరించారు.
జింకు ధాతువు ప్రాముఖ్యత :
మొక్కలలో మాంసకృత్తులు అమినో ఆమ్లాల తయారీకి నత్రజని, భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి ఇది తోడ్పడుతుంది. అలాగే మొక్క పెరుగుదలకు కావాల్సిన ఇండోల్ అసిటిక్ ఆమ్లం ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. పత్ర హరితంలో కిరణ జన్య సంయోగ క్రియకు తద్వారా ఆహార తయారీకి జింకు ముఖ్య ధాతువుగా ఉపయోగపడుతుంది.
జింకు లోపానికి ప్రధాన కారణాలు :
● సేంద్రియ ఎరువులను తగినంత మోతాదులో వాడకపోవడం.
● భూమిలో క్షార గుణం, సున్నపు పాల్లు ఎక్కువగా ఉండటం.
● సంవత్సరం పొడవునా ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటూ మురుగు పోకుండా ఉండటం.
● ఏటా వరి పంటనే సాగు చేయడం.
● ఉదజని సూచిక 8.0 కంటే ఎక్కువగా ఉండటం
● సమస్యాత్మక నేలలను బాగు చేసే క్రమంలో నేలల్లో ఒక్కో సారి సున్నం ఎక్కువై జింకు లోపం కనిపిస్తోంది.
వరిలో జింకులోప లక్షణాలు..
● నారు మళ్లలో నాటు వేసిన 2 నుంచి 6 వారాల వరకు కనిపిస్తోంది.
● లోప లక్షణాలు ఎక్కువగా పల్లపు ప్రాంతాల్లో కనిపిస్తోంది.
● వరి మొక్కలలో పై నుంచి 3 లేదా 4వ ఆకు మధ్య ఈనె ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు రంగుకు మారుతాయి.
● ఆకు చివరలో మధ్య ఈనెకు ఇరువైపులా తుప్పు లేదా ఇటిక రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఆకులన్నీ రాలిపోతాయి.
జింకు లోప నివారణ చర్యలు ఇలా..
వరి నాటే ముందు ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్(21 శాతం) వేసుకోవాలి. నాట్లు వేసిన తర్వాత 2 నుంచి 5 వారాల మధ్య జింకు లోపం కనిపిస్తే పొలంలోని పాత నీటిని తీసి కొత్త నీటిని పెట్టాలి. ఈ చర్య వలన ఉదజని సూచిక 7కు తగ్గి జింక్ లభ్యత పెరుగుతుంది. పైరులోపల లక్షణాలు కనిపించినప్పుడు 2 గ్రాములు చీలేటెడ్ జింక్‌ను లీటర్ నీటిలో కలిపి వారం రోజు ల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
జింక్ వాడకంలో మెలకువలు :
పచ్చి రోట్టెతో పాటు జింక్ సల్ఫేట్ లభ్యత మరింతగా పెరుగుతుంది. భాస్వరం ఎరువుల వాడకానికి జింక్ సల్ఫేట్ వాడకానికి మధ్య కనీసం 3 నుంచి 4 రోజుల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పురుగు లేదా తెగులు మందులతో కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.


