● 14 గంటల పాటు నీళ్లు కూడాతాగకుండా ఉపవాసం
● దైవానుగ్రహం కోసం ప్రత్యేక నమాజులు
స్టేషన్ మహబూబ్‌నగర్: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల వచ్చేసింది. ఈ పవిత్ర నెలంతా ఉపవాసాలు ఉంటూ జకాత్, ఫిత్రా పేర్లతో తనకున్న సంపాదనలో కొంత భాగాన్ని దాన, ధర్మాలు చేయడం దీక్షాపరుల్లోని మానవీయ కోణాన్ని తట్టిలేపుతాయి. అలాగే నిరుపేదలకు తినుబండారాలు, వస్త్రాల పంపిణీతో పాటు ఆర్థిక సాయం చేస్తూ ముస్లిం సోదరులు దాతృత్వాన్ని చాటుకుంటారు. దాహాగ్ని దహింపచేసే తీవ్రమైన వేసవి అయినా సరే రంజాన్ దీక్షకు మినహాయింపు ఉండదు. దాదాపు 14 గంటల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దైవానుగ్రహం కోసం ఉపవాసంతో పాటు రాత్రి ప్రత్యేక నమాజులు చదవడంతో పాటు నెల రోజులు నియమ నిష్టలతో గడుపుతారు.
రంజాన్‌లో ప్రత్యేక నమాజులు...
ప్రతి రోజు ఐదు పూటలా నమాజు చేసే ముస్లింలు రంజాన్‌లో తరావీ, తహజుద్, సలాతుతబ్జీ అనే ప్రత్యేక నమాజులు చేస్తారు. తరావీ నమాజులో 20 రకాతులు ఉంటాయి. ఇషా నమాజు అనంతరం గంటన్నర పాటు ఈ నమాజు చదువుతారు. తహజుద్ నమాజు రాత్రి 3 గంటల నుంచి 4గంటలలోపు నాలుగు లేక 8 రకాతులు చేస్తారు. సలాత్‌తబ్జీ నమాజు రోజులో ఒక సారి గాని, వారంలో ఒకసారి గాని చదవాలి. అత్యంత పుణ్యప్రదమైన ఈ నమాజు చాలా దోషాల నుంచి విముక్తి కలిగిస్తుందని ముస్లింల నమ్మకం. రంజాన్ మాసంలో మజీదుల్లో దీక్షాపరులు నిర్వహించే సామూహిక ఇఫ్తారు విందులు ముస్లిం సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది.
జుమాతుల్ విదా నమాజు...
రంజాన్‌లోని శుక్రవారం జుమా నమాజ్‌లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా చివరి శుక్రవారం చదివే నమాజును జుమాతుల్‌విదా అంటారు. ఈ జుమా నమాజును వేలాదిమంది ఒకేసారి మసీదులో, బయట చదువుతారు. పవిత్రమైన రంజాన్ నెలలో తాము చేసిన ఉపవాసాలను అంగీకరించమని అల్లాను వేడుకుంటూ రంజాన్‌కు వీడ్కోలు పలికే ఈ నమాజుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.
షబే ఖదర్‌కు ఎంతో విశిష్టత
రంజాన్‌లో షబే ఖదర్ (పెద్దరాత్రి) చాలా విశిష్టమైంది. రంజాన్ మాసంలోని 21, 23, 25, 27, 29 తేదీల్లోని రాత్రుల్లో అల్లా తన చివరి ప్రవక్త మహ్మద్ (స.అస) ద్వారా పంపిన సందేశాలు ఖురాన్ గ్రంథంగా అవతరించిందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. ఈ ఒక్క రాత్రి చేసే నమాజు వల్ల వెయ్యి నెలలు నమాజు చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతారు. వీటిలో రంజాన్ నెల 27వ తేదీని అతి ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ‘షబే ఖద్ర్’ జాగరణ పాటిస్తారు. వెయ్యి సాధారణ రాత్రుల కంటే ప్రధానమైందని ఖురాన్‌లో ప్రవచించినందున ముస్లింలు ఈ రాత్రి జాగరణ చేసి క్షమాభిక్షను కోరుతూ ఇంటిల్లిపాదీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.


