నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి
ఎర్రవల్లి: నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోదండాపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుర్వ సుధాకర్, రామలక్ష్మికి ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి ఉన్నారు. వారు గొర్రెల కాపలాకు వెళ్లడంతో నానమ్మతో కలిసి పిల్లలు ఉంటున్నారు. ఈ క్రమంలో రెండో సంతానమైన సుదర్శన్ (3) సెలవు దినం కావడంతో ఇంటి వద్ద సిరంజితో డ్రమ్ములోని నీటితో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో సిరంజి డ్రమ్ములో పడడంతో దానిని తీసుకునేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి డ్రమ్ములోని నీటిలో పడి ఊపిరాడక మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నీటిలో విగతజీవిగా పడిఉన్న చిన్నారిని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటనపై ఎస్‌ఐ తరుణ్‌కుమార్‌రెడ్డిని సాక్షి వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాధు అందలేదని పేర్కొన్నారు.
సిరంజితో ఆడుకుంటూ పడిన వైనం


