‘మన ఓటు మనకే’ నినాదంతో ముందుకు..
మెట్టుగడ్డ/జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాబో వు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలంతా ఏకమై మన ఓటు మనకే నినాదంతో ముందుకు సాగాలని తెలంగాణ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన పుర ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌పార్టీ మాట తప్పిందని విమర్శించారు. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విభజించు పాలించు విధానాన్ని సమష్టిగా ఎదుర్కొని బీసీల ఐక్యత చాటాలని, రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. మేయర్ పదవి బీసీ మహిళకు కేటాయించాలని కోరారు. అనంతరం మహాసభ కార్యనిర్వాహక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. పాలమూరులో స్వార్థపూరిత రాజకీయ నాయకులతో డివిజన్ల విభజన అశాస్రీయంగా జరిగిందని ఆరోపించారు. గతంలో పిల్లలమర్రి నుంచి విభజన పాయింట్ ప్రారంభమయ్యేదని, మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులను సంప్రదించే వారని.. అందుకు భిన్నంగా నాలుగు గోడల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా డివిజన్ల విభజన జరిగిందని.. పునరాలోచించి సరి చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన పాలన కోసం నిజాయితీ గల బీసీ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రామచంద్రయ్య, రిటైర్డ్ తహసీల్దార్ ప్రభాకరాచారి, సిద్ధిరామప్ప, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కుల, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


