‘ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలి’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలిక ఐటీఐ కాలేజీ ఆవరణలో ఐటీఐ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఫోరం) ఉమ్మడి జిల్లా ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఐటీఐ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పోరాడే సంఘం టీఎన్‌జీఓ మాత్రమేనని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురి అవుతారని పేర్కొన్నారు. టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, నాయకులు భరత్, కొండల్ రెడ్డి, ఐటీఐ ఫోరం జిల్లా అధ్యక్షులు నవీన్, కార్యదర్శి నర్సింహులు, మహేష్, దీప్తి, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


