616 ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్‌కర్నూల్‌లో 121, కొల్లాపూర్‌లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6చ అమరచింత 4, ఆత్మకూర్‌లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మున్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
ముసాయిదాలో తప్పొప్పులను సరిదిద్దండి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముసాయిదా ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పొప్పులను వెంటనే సరిదిద్దాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏయే డివిజన్‌లో ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు? ఇతర జిల్లాలు, గ్రామాలకు చెందిన వారి పేర్లు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించి తొలగించాలన్నారు. ఈనెల 10న ప్రకటించే తుది జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా అజాగ్రత్తగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, మేనేజ ర్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్ల సమస్యలు పరిష్కరిస్తాం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ట్రాన్స్‌జెండర్ల సమస్యలను ఆయా శాఖల ద్వారా పరిశీలించి పరిష్కరిస్తామని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ లో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాగా, తమకు కొత్త ఆధార్ కార్డుల జారీతో పాటు వాటిలో ఏమైనా సవరణలుంటే తప్పక చేయాలన్నారు. ముఖ్యంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమాధి స్థలం కేటాయించాలన్నారు. వీటన్నింటినీ కలెక్టర్ విజేందిర బోయికి దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి జరీనాబేగం, జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం రవినాయక్ పాల్గొన్నారు.
నేడు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల బాట
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులను మంగళవారం బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు సందర్శించనున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా జూరాల కుడి, ఎడమ కాల్వను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అలాగే కొల్లాపూర్ సమీపంలోని ఎంజీకేఎల్‌ఐతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పరిశీలిస్తామని తెలిపారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,679
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,679, కనిష్టంగా రూ.1,831 ధరలు లభించాయి. అలాగే హంస గరిష్టంగా రూ.1,911, కనిష్టంగా రూ.1,831, కందులు గరిష్టంగా రూ.6,960, కనిష్టంగా రూ.5,689, వేరుశనగ గరిష్టంగా రూ.8,766, కనిష్టంగా రూ.7,129, పెబ్బర్లు రూ.7,369, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,710 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా రూ.6,702, కనిష్టంగా రూ.6,512, ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం రూ.2,630గా ఒకే ధర లభించాయి.
616 ఫిర్యాదులు


