11న సామాజిక న్యాయసభ
మెట్టుగడ్డ: రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న పాలమూరులో సామాజిక న్యాయసభ నిర్వహిస్తున్నట్లు బీసీ ఇంటలెక్చువల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డా. వేణుకుమార్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని.. 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు బీసీల పక్షాన నిలబడలేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది శాతం కూడా లేని ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించి బీసీల పట్ల చారిత్రక శత్రువుగా మిగిలిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పాలమూరులో నిర్వహించే సామాజిక న్యాయసభకు ఉమ్మడి జిల్లాలోని బీసీ బహుజనులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ చైర్మన్ బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో సామాజిక న్యాయసభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ టి.చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్, బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ముఖ్యవక్తలుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు రమేష్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, జుర్రు నారాయణ యాదవ్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ సారంగి లక్ష్మీకాంత్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


