దేశం గర్వించే నేత కర్పూరి ఠాకూర్
మెట్టుగడ్డ: రిజర్వేషన్లకు ఆధ్యునిగా దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన మహనీయుడు కర్పూరి ఠాకూర్ అని.. భారతరత్నతో గౌరవించడం గొప్ప విషయం అని బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్‌లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జాతీయ ఎంబీసి ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాలు, బీసీల్లోని కొన్ని పెత్తందారి కులాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడు కర్పూరి ఠాకూర్ అని అన్నారు. రెండు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన జీవితం అందరికి ఆదర్శం అని అన్నారు. కర్పూరి ఠాకూర్ రూపొందించిన రిజర్వేషన్ల విధానమే ఆయన ఫార్మూలాగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఆ రోజుల్లోనే బీసీలకు 26శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడని, తదుపరి కాలంలో మండల కమీషన్‌కు నమూనాగా కూడా అదే నిలిచిందన్నారు. బడుగు వర్గాల గుండె చప్పుడుగా భారతీయ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసి కన్వీనర్ బెక్కెం జనార్ధన్, బీసి సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్, కోరమోని వెంకటయ్య, రవి ముదిరాజ్, వెంకటస్వామి, సత్యశిల సాగర్, వెంకటేష్ గౌడ్, దుర్గేష్, బుగ్గన్న, డీకె నాయీ, అశ్వి ని సత్యం, బాలరాజు తదితరులు పాల్గోన్నారు.


