ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ఏడాదిలో మూడుసార్లు..
● ఉమ్మడి పాలమూరు డీటీసీ కిషన్
ఆదాయానికి మించి
ఆస్తులున్నాయని కేసు నమోదు
● మూడుగంటల పాటు
కొనసాగిన తనిఖీలు
● ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిబ్బందితో లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు
● లభించని ఆధారాలు
మహబూబ్‌నగర్ క్రైం: హైదరాబాద్ సిటి రేంజ్–1 ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో 8 మంది బృందం మంగళవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా రవాణాశాఖ డీటీసీగా పని చేస్తున్న కిషన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడంటూ కేసు నమోదులో భాగంగా నేరుగా చాంబర్‌కు చేరుకున్న బృందం బయటి వ్యక్తులు లోనికి రాకుండా, అక్కడి సిబ్బంది ఎవరితో మాట్లాడకుండా ఆదేశాలిచ్చారు. సుమారు మూడు గంటల పాటు అన్నిరకాల రిజిస్ట్రేషన్ దస్త్రాలు, ఇతర డాక్యుమెంట్స్, వ్యక్తిగత కంప్యూటర్ తనిఖీ చేశారు. అలాగే కార్యాలయంలో పనిచేసే అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అయితే ఇక్కడ విధులు నిర్వర్తించే ఇద్దరు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా సోదాల్లో విలువైన డాక్యుమెంట్స్, ఇతర ఆధారాలు ఏవీ లభించలేదు. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో బృందం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కార్యాలయంలో పని చేసే సిబ్బందితో పాటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి లెక్కల్లో లేని కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ కార్డులు ప్రైవేట్ వ్యక్తుల ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో డీటీసీ కిషన్ విధుల్లో చేరారు. గతంలో పని చేసిన ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం.
● ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు డీటీసీ కిషన్‌పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సోదాల అనంతరం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనిఖీల్లో భాగంగా కిషన్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశామన్నారు. తనిఖీల నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు.
మహబూబ్‌నగర్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది మూడుసార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జూన్ నెలలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు చేసి ఇద్దరు ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించింది.
అక్టోబర్ 19న కృష్ణా చెక్‌పోస్టులో మహబూబ్‌నగర్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి అనధికారిక నగదు రూ.30,450 సీజ్ చేశారు. ఓవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలోనే లారీడ్రైవర్లు టేబుల్‌పై డబ్బులు పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. తర్వాత చెక్‌పోస్ట్ రద్దు చేశారు.
తాజాగా మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ బృందం ఆర్టీఏ కార్యాలయంలో అడుగుపెట్టింది.


