ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాలి
● తూనికల, కొలతల అధికారుల ముమ్మర దాడులు
● నిబంధనలు ఉల్లంఘించిన
వ్యాపారులపై చర్యలు
● పట్టణంలో 50 కేసులు నమోదు
జడ్చర్ల: పట్టణంలో మంగళవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఆరు బృందాలుగా విడిపోయి ఎలక్రికల్, ఎలక్ట్రానిక్, జనరల్స్ స్టోర్స్ తదితర దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనల మేరకు పలు ఉత్పత్తులపై నమోదు చేయాల్సిన సమాచారం లేకపోవడాన్ని తప్పుబట్టారు. వినియోగదారులకు కొనుగోలు చేసే ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధగా చేపట్టే క్రయవిక్రయాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ సిద్దార్థ్‌కుమార్ తెలిపారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న దుకాణాలకు సంబంధించి 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వనపర్తి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి రవీందర్, నాగర్‌కర్నూల్ జిల్లా అధికారి నాగేశ్వర్‌రావు, నల్లగొండ జిల్లా అధికారి శ్రీనివాసులు, భువనగిరి జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కలకలం రేపిన దాడులు:
పట్టణంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జరిగిన దాడులు చర్చనీయాంశంగా మారింది. గతంలో అడప దడపా కిరాణ దుకాణాలపై మొక్కుబడిగా తనిఖీలు చేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఇంత పెద్దఎత్తున అన్ని రకాల దుకాణాలపై దాడులు చేయడం ఇదే ప్రథమమని వ్యాపారులు పేర్కొన్నారు. వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు.


