పాలమూరుకు అన్యాయం చేసిన కేసీఆర్
పాలమూరు: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఆర్‌డీఎస్ ఎందుకు పూర్తి చేయలేదని, పెండింగ్‌లో మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్ తీసుకునే విధంగా డీపీఆర్ మార్పులు చేసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారన్నారు. కాళేశ్వరానికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిన అప్పటి సర్కార్ పాలమూరు–రంగారెడ్డిపై ఎందుకు ఖర్చు చేయలేదన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో రోడ్లు వేసుకుని పాలమూరులో ఎందుకు వేయలేదని, ప్రాజెక్టులతోపాటు వైద్యం, విద్య ప్రతిదాంట్లో ద్రోహం చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి రెండు పార్టీలు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. డిండికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకెళ్లడంపై తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని, ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు సరిపోవని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొత్త అప్పులు చేస్తోందన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటే మరింత పనులు జరుగుతాయన్నారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ జీ రామ్ జీ బిల్లు కేంద్రం చట్ట సవరణ చేసిందన్నారు. దేశంలో 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమయంలో జరగని ఓటు చోరి.. మూడేళ్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ హయాంలో జరిగిందని చెప్పడం సరికాదన్నారు. కొత్తగా గెలుపొందిన సర్పంచులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, రమేశ్, కృష్ణవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● మూసాపేట మండలం దాసర్‌పల్లి ఉపసర్పంచ్ బోయ నర్సింహులుతోపాటు వార్డు సభ్యులు, హన్వాడ మండలం గొండ్యాల్ ఉపసర్పంచ్ రంగన్నతోపాటు వార్డు సభ్యులు ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం జాతీయ రహదారి అధికారులతో బండమీదిపల్లి దగ్గర ఉన్న రోడ్డు సమస్యపై చర్చించారు.
● నగరంలోని కాళికాదేవి కల్యాణ మండపంలో మంగళవారం సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్ని మాట్లాడారు.


