విపత్తులు ఎదుర్కోవడంపై మాక్ డ్రిల్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు వర్షాలు, వరదలు లాంటి విపత్తులు సంభవిస్తే జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలి.. సహాయక చర్యలు ఎలా సమన్వయంతో నిర్వహించాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ చేపట్టారు. సోమవారం జిల్లాలో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని రామయ్య బౌలి, పరిసర ప్రాంతం పెద్ద చెరువు, కొత్త చెరువు, అమరరాజా ప్రాంతం, జడ్చర్ల ఏరియా హాస్పిటల్ తదితర ప్రాంతాలలో వరద పరిస్థితులను సృష్టించి, వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా అమలు చేశారు. కలెక్టర్ విజయేందిర ఎస్పీ జానకితో కలిసి రామయ్యబౌలి వద్ద ఉన్న పెద్ద చెరువు, కొత్తచెరువు వద్ద మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న పశువులను, నీటిలో మునిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని, నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీస్, అగ్నిమాపక, అటవీ , రెవెన్యూ, పశు సంవర్ధక శాఖ, ఆపద మిత్ర వలంటీర్‌లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో రక్షణ సహాయక చర్యలు మాక్ డ్రిల్ చేపట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అగ్నిమాపక శాఖ అధికారి కిషోర్, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు


