గొర్రెల కాపరుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబ్‌నగర్(వ్యవసాయం): గొర్రెల కాపరుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అప్పనపల్లిలో సోమవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌లతో కలిసి ఆయన గొర్రెలు–మేకలకు, నట్టల నివారణ మందులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వం రూ.4.5కోట్లతో నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. గొర్రెలు, మేకలు వ్యాధుల కారణంగా మృతి చెందినప్పుడు కాపరులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త బీమా పథకాలను తీసుకొస్తోందని తెలిపారు. పశుపోషణే అనేక కుటుంబాలకు ప్రధాన జీవనాధారం కావడంతో, వాటి రక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందన్నారు. కుక్కల దాడుల నుంచి గొర్రెలు, మేకలను కాపాడేందుకు ప్రభుత్వం తేలికపాటి బలమైన నెట్‌లను కాపరులకు అందజేస్తోందని తెలిపారు. ఇవి ఉపయోగించడానికి సులభంగా ఉండటంతో పాటు రాత్రి సమయంలో కూడా పశువులకు మెరుగైన రక్షణ కల్పిస్తాయని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని, వెటర్నరీ సిబ్బందితో సహకరించాలని కాపరులను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర, తదితరులు పాల్గొన్నారు.


