లైంగికదాడి ఘటనలో నిందితుడి అరెస్ట్
● మూసాపేట పీఎస్‌లో వివరాలు
వెల్లడించిన ఎస్పీ జానకి
అడ్డాకుల: మూసాపేట మండలం వేములలో దళిత యువతిని అత్యాచారం చేయడంతో యువతి మృతిచెందిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ డి.జానకి మూసాపేట పోలీస్ స్టేషన్‌లో శనివారం సాయంత్రం వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. వేములకు చెందిన తిరుపతయ్యకు ఇద్దరు భార్య లు. పెద్ద భార్య జయమ్మతో కలిసి తిరుపతయ్య వేములలో నివాసం ఉంటున్నాడు. చిన్న భార్య పద్మ చిన్నచింతకుంట మండలం పల్లమర్రిలో నివాసముంటుండగా.. ఆమె కుమారుడు, నిందితుడు సంగు విష్ణు అక్కడే ఉంటున్నాడు. నిందితుడు తరచూ వేములకు వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట వినాయక చవితి నిమజ్జనానికి వచ్చినప్పుడు మృతురాలు యువతి (21)కు విష్ణుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచూ ఫోన్లో మాట్లాకునేవారు. ఈ క్రమంలో ఈనెల 15న విష్ణు వేములకు వచ్చాడు. 17న ఎన్నికలు పూర్తయి ఊరేగింపు జరుగుతుండగా.. రాత్రి 8గంటల సమయంలో యువతికి ఫోన్ చేసి రైతువేదిక వద్దకు రమ్మని పిలిచాడు. రైతువేదిక వద్దకు రాగానే ఆమెతో మాట్లాడుతూ.. లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలోఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే బంధువు భారతికి ఫోన్ చేసిన విష్ణు ఆమె రాగానే బాధితురాలిని సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. తర్వాత భారతితోపాటు వారి బంధువులైన అరుణ్, అజయ్‌తో కలిసి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో తల్లి సత్యమ్మను పిలిచి శివకుమార్ ఆటోలో జానంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్ రాగా అందులో జానంపేట పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మరుసటి రోజు ఉదయం మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారని చెప్పారు. నిందితుడు విష్ణును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమేమైనా ఉందా అన్నదానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్‌బీ సీఐ బాలరాజు, ఎస్‌ఐ వేణు తదితరులు ఉన్నారు.


