నల్లమల చరిత్ర సంతృప్తినిచ్చింది
మన్ననూర్: నల్లమల అటవీ ప్రాంతం, సహజ సంపద, జీవవైవిధ్యం, పర్యాటక అంశాలు తనను ఎంతగానో ఆకర్శించాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్‌కుమార్ అన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంను దర్శించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో శనివారం మన్ననూర్‌లోని మృగవాణి గెస్టు హౌస్‌లో నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో సమావేశమై కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా నల్లమల పరివాహక ప్రాంతంతోపాటు అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, చారిత్రక ప్రదేశాలు, శైవక్షేత్రాలు, జలపాతాలు, వన్యప్రాణి సంరక్షణ, జీవవైవిధ్యం, జంగల్ సఫారీ, టూరిజం అభివృద్ధి తదితర అంశాల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటరు జాబితా ఆధునీకరణ, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్ల గురించి కలెక్టర్ వివరించారు. అనంతరం సీఈసీ మాట్లాడుతూ ఈ పర్యటన తనను ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ పనివిధానంను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
సీఈసీ జ్ఞానేశ్వర్‌కుమార్


