రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
నాగర్‌కర్నూల్ క్రైం/ పెద్దకొత్తపల్లి: విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సతీష్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని శాయినిపల్లికి చెందిన ఆంజనేయులు(32) పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆంజనేయులు శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని స్వ గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా మండలంలోని వావిల్లబావి వద్ద జాతీయ రహదారి–167కేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై ఆంజనేయులు భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కానిస్టేబుల్ కుటుంబానికి
అండగా ఉంటాం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ ఆంజనేయులు కుటుంబానికి పోలీసుశాఖ తరపున అండగా ఉంటామని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్ తెలిపారు. ఎస్పీ శనివారం జనరల్ ఆస్పత్రి వద్దకు చేరుకుని కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు లాంచనాలతో కానిస్టేబుల్‌కు అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు తదితరులున్నారు.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం


