
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో 1.15 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 57,136 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు చెప్పారు. అలాగే విద్యుదుత్పత్తికి 33,419 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 650, ఆవిరి రూపంలో 46, కుడి కాల్వకు 700, ఆర్డీఎస్ లింకు కెనాల్‌కు 50 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.193 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు.
విద్యుదుత్పత్తి వేగవంతం..
ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. శనివారం ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 205.877 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 244.102 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటివరకు 449.979 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని చెప్పారు.
‘సంగంబండ’ ఒక గేట్ ఎత్తి..
మక్తల్: మండలంలోని సంగంబండ వద్ద ఉన్న చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం అధికం కావడంతో శనివారం ఒక గేట్ పైకెత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ డీఈ సురేష్ తెలిపారు. కర్ణాటకలోని ఇడ్లూర్ పెద్దవాగు నుంచి నీటి ప్రవాహం అధికంగా రావడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగిందని చెప్పారు.
శ్రీశైలం జలాశయానికి..
దోమలపెంట: కృష్ణా బేసిన్‌లో వరద పెరగడంతో జూరాల ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా శనివారం శ్రీశైలం జలాశయానికి నీటి విడుదల చేస్తున్నారు. జూరాల స్పిల్‌వే ద్వారా 57,136 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 53,768, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతోందన్నారు. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,465 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 879.1 అడుగుల నీటిమట్టం.. 183.4198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 32,750 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్‌ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 15.776 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 14.982 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు.
1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల