
పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
గద్వాల క్రైం: జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను సోమవారం ఉదయం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానికుల కథనం మేరకు.. గద్వాల మండలంలోని వీరాపురం, లత్తీపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యవకులు ఆన్‌లైన్ నగదు చెల్లింపుల విషయంలో సమస్యాత్మకంగా వ్యవహరించినట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అందుల్లో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఈ విషయంపై రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. హైదరాబాద్‌కు చెందిన పోలీసులు వచ్చిన విషయం వాస్తవామేనని, అదుపులోకి తీసుకున్న యువకులను ఎందుకు తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు.
భిక్షాటన చేసి ఆలయానికి రూ.1.83 లక్షలు విరాళం
కృష్ణా: ఓ మహిళా యాచకురాలు బిక్షాటన చేస్తూ ఏకంగా రూ.1.83 లక్షలు పోగు చేసింది. ఆ మొత్తాన్ని ఓ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన వృద్ధురాలు రంగమ్మ కొన్నేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చేరుకుంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. తన అవసరాలను తీర్చుకోగా మిగిలిన డబ్బును కొద్ది కొద్దిగా జమ చేస్తూ వచ్చింది. ఇలా కొన్నేళ్లపాటు జమ చేయగా.. మొత్తం రూ.1.83 లక్షలు అయ్యింది. ఈ మొత్తాన్ని రాయచూర్ జిల్లాలోని బిజనగేరి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి దేవుడిపై తన భక్తిని చాటుకుంది. రూ.కోట్లు సంపాయిస్తున్న వారు సైతం రూ.వెయ్యి విరాళం ఇచ్చేందుకు వెనకాడే ఈ రోజుల్లో ఏళ్ల తరబడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని రూ.లక్షలు జమ చేసి ఆలయానికి విరాళంగా ఇవ్వడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు రంగమ్మ పెద్ద మనస్సును కొనియాడుతున్నారు.