
ఆధునికతకు ఆమడదూరం!
జడ్చర్ల టౌన్: స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గ్రంథాలయాలు నేటికీ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో పూర్తిగా వెనకబడి ఉండగా.. అందులో పనిచేస్తున్న గ్రంథపాలకుల పరిస్థితి అయోమయంగా మారింది. విజ్ఞాన భాండాగారాలుగా పిలుచుకుంటున్న గ్రంథాలయాల్లో వేలాది పుస్తకాలు ఉన్నప్పటికీ మనకు కావాల్సిన పుస్తకాలను వెంటనే అందించే అద్భుతమైన ప్రావీణ్యం మన గ్రంథపాలకుల్లో ఉంది. ఎస్‌ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ లైబ్రేరియన్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే తమకు సరైన గుర్తింపు లభించడంలేదని, గ్రంథాలయాలు ఆధునీకరణకు నోచుకోవడంలేదని వాపోతున్న లైబ్రేరియన్స్ గూర్చి తెలుసుకుందాం.
తండ్రిపేరిట రెనోవేషన్
డా.బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయం ఇరుకుగదుల్లో ఉండేది. రెండేళ్లక్రితం లైబ్రేరియన్‌గా బదిలీపై వచ్చిన ఆంజనేయులు ఎలాగైనా ఆధునీకరించాలని లక్ష్యంగా ముందడుగు వేశాడు. అందుకు దాతల సహాయం ఆర్జించినప్పటికీ ఎవరు సహకరించలేదు. ఇదే సమయంలో కళాశాలలోని రెండు గదులు అందుబాటులోకి రావడంతో దాంట్లోకి లైబ్రరీని మార్చాలని నిర్ణయించుకుని తన తండ్రి ఇప్పల నాగభూషణం స్మారకార్థం రూ.లక్ష వెచ్చించి గదులను తనకు అనుకూలంగా మార్చుకుని గ్రంథాలయాన్ని కిందకు బదలాయించారు. ప్రస్తుతం రెండు పెద్ద గదుల్లో 108 ర్యాక్స్‌లో 26వేల పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న మూడు కంప్యూటర్లను ప్రిన్సిపాల్ అనుమతితో గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. నిత్యం 150నుంచి 200మంది విద్యార్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పుస్తకపఠనం చేసేందుకు వస్తున్నారు.
డిజిటలైజేషన్‌కు నోచుకోని గ్రంథాలయాలు
గుర్తింపునకు తాపత్రయ పడుతున్న గ్రంథపాలకులు
నేడు జాతీయ గ్రంథాలయ అధికారుల దినోత్సవం
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 69 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో కేవలం 14గ్రంథాలయాలకు మాత్రమే లైబ్రేరియన్స్ ఉన్నారు. మిగిలిన వాటిలో ఇన్‌చార్జిలు, ఔట్‌సోర్సింగ్‌తో నెట్టుకొస్తున్నారు. ఇక 68 జూనియర్ కళాశాలలకుగానూ 44 కళాశాలల్లో మాత్రమే లైబ్రేరియన్ పోస్టులున్నాయి. వాటిలో కేవలం 22మంది లైబ్రేరియన్‌లు మాత్రమే పనిచేస్తున్నారు. శాఖ గ్రంథాలయాలు, జూనియర్ కళాశాలల్లోని గ్రంథాలయాల్లో ఎక్కడ డిజిటలైషన్ జరగలేదు. పాత పద్ధతిన పంచసూత్రాల ఆధారంగానే పుస్తకాల అమరిక, పాఠకుడికి అందించడం జరుగుతుంది.
డిజిటలైజేషన్ కావాలి
సాంకేతికతకు అనుగుణంగా లైబ్రరీలు డిజిటలైజేషన్‌కు నోచుకోవాలి. ప్రభుత్వం ఇందుకు దృష్టిసారించాలి. మా డిగ్రీ కళాశాలలోని లైబ్రరీకి మరిన్ని కంప్యూటర్లు వస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అలాగే లైబ్రేరియన్స్ డేను అధికారికంగా నిర్వహించి ఉత్తమ పురస్కారాలు అందిస్తే మరింత ఉత్సాహంతో పనిచేయటానికి వీలుంటుంది.
– ఆంజనేయులు, లైబ్రేరియన్,
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల
అమలుకాకుండానే
పదవీ విరమణ
లైబ్రేరియన్స్ డేను ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ఆశించినప్పటికీ అది జరగకుండానే పదవీ విరమణ పొందాను. ఇప్పటికై నా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. శాఖ, కళాశాలల్లోని గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ అమలు చేయాలి. పూర్తిస్థాయి నియామకాలు జరిపితే విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేసే ఆస్కారం కలుగుతుంది.
– జయప్రకాశ్, రిటైర్డ్ లైబ్రేరియన్, జడ్చర్ల

ఆధునికతకు ఆమడదూరం!

ఆధునికతకు ఆమడదూరం!

ఆధునికతకు ఆమడదూరం!