
భక్తుల ఆరాధ్యదైవం గెల్వలాంబమాత
వంగూరు: మండల కేంద్రంలో కొలువుదీరిన గెల్వలాంబమాత ఉత్సవాలు ఈనెల 13 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అలంకరణ, విద్యుద్ధీకరణ, తాగునీరు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 13న అమ్మవారి మేలుకొలుపు, తోరణ అలంకరణ, గణపతి పూజ, సాయంత్రం నజర్ బోనాలు, వైశ్యుల బోనాలు, అనంతరం బండ్లు, వాహనాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. 14న అమ్మవారికి గండదీపం, సాయంత్రం రెడ్లు, పద్మశాలిలు, బోయ, గౌడ్స్, యాదవుల బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ, కోలాటాలు, భజనలు ఉంటాయి. 15 ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం ముదిరాజ్‌ల బోనాలు, బండ్లు తిరుగుతాయి. 16 తెల్లవారుజామున రథోత్సవం, శ్రీకృష్ణ జననం, డోలారోహణం ఉంటుంది. 17 సాయంత్రం యాదవులు ఉట్టి కొట్టుట, బాలబాలికల చేత శ్రీకృష్ణ, గోపికల వేషాధారణ. అనంతరం మహామంగళహారతితో జాతర ముగుస్తుంది.
● ఉత్సవాల్లో భాగంగా 14న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరవుతారని దేవస్థాన కమిటీ ఛైర్మన్ నకిరమోని శేఖర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు రెండు రోజులపాటు ఉత్సవాల్లో పాల్గొంటారు.
● బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14న రాత్రి పలువురు ప్రత్యేక ఫోక్ సింగర్లచేత ఆటాపాట నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
13 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు
ఐదు రోజులపాటు బోనాలు, ఉత్సవాలు
ఏర్పాట్లు చేస్తున్న దేవస్థాన కమిటీ