
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
రాజోళి: ‘‘సస్పెండ్ అయితే ఏంటి.. సగం జీతం వస్తుంది కదా.. దాంతో జీవితాన్ని సరదాగా గడిపేస్తా’’ అని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళవారం ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన ‘లంచం ఇచ్చే విధుల్లోకి వచ్చా’ కథనానికి ఎంఈఓ భగీరథరెడ్డి స్పందించారు. ఈ మేరకు చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు రవిచందర్ తీరుపై విచారణ చేపట్టారు. అప్పటికే సదరు ఉపాధ్యాయుడు ఫూటుగా మద్యం తాగి వాటర్‌ట్యాంక్ వద్ద ఏదీ గుర్తులేకుండా నిద్రించాడు. ఎంఈఓ విద్యార్థులతో వివరాలు సేకరించగా.. తరగతి గదిలోనే మద్యం తాగి నిద్రిస్తాడని.. మద్యం మత్తులో తమను ఇష్టం వచ్చినట్లు తిడతాడని విద్యార్ధులు ఎంఈఓతో వాపోయారు. ఈ క్రమంలోనే వాటర్‌ట్యాంక్ వద్ద మద్యం మత్తులో నిద్రిస్తున్న సదరు ఉపాధ్యాయుడిని పాఠశాల వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓతో అతడు మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న సమస్యల కారణంగా పిల్లల సంఖ్య తగ్గుతుందని, అందుకు తామేమి చేస్తామని బదులిచ్చారు. అయితే విద్యార్థులతో పుస్తకాలు చదివించవమని ఎంఈఓ సూచించగా, మద్యం మత్తులో ఊగుతూ.. తూగుతూ నానా తంటాలు పడ్డాడు. పాఠశాలలోనే మద్యం తాగే నీపై చర్యలు తప్పవని ఎంఈఓ అనగా.. పర్లేదు సార్ సస్పెండ్ అయినా సగం జీతం వస్తుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అనంతరం ఎంఈఓ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ విచారణలో సదరు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలే అని అన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, గతంలో కూడా విచారణ చేసి వదిలేశారని.. ఇప్పటికై నా కఠిన చర్యలు తీసుకుంటారో లేదోనని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
మద్యం మత్తులో మాస్టరు సమాధానానికి అవాకై ్కన ఎంఈఓ