
ముదురు నారులో యాజమాన్య పద్ధతలు
అలంపూర్: జిల్లాలో వరిసాగు విస్తారంగా ఉందని కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. ఈ నేపథ్యంలో ముదురు నారులో యాజమాన్య పద్ధతులపై రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
నీటి విడుదలలో జాప్యం
నీటి విడుదల్లో జాప్యం, వర్షాభావ పరిస్థితులు, బోరు బావు కింద సాగు చేయడంలో సమస్యలు వంటివి కారణాలతో వరినాట్లు వేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ముందుగా వేసుకున్న నారుమడ్లలో వరినారు ముదిరే అవకాశాలు లేకపోలేదు. ముదిరిన నారు వేసుకోనే యాజమాన్య పద్ధతుల్లో కేవలం సన్నరకం వరి వంగడాలకు మాత్రమే వర్తిస్తోందని వివరించారు.
30 రోజులు దాటితే
సాధారణంగా 30 రోజుల నారును నాటు వేస్తారు. సాలుకు మధ్య 20 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటిమీటర్ల దూరంతో నాటు వేసుకోవాలి. నారువేసి 30 రోజులు దాటిందంటే దానిని ముదిరిన నారుగా పరిగణించాలి. 30 నుంచి 40 రోజుల నారును నాటేటప్పుడు సాలుకు సాలుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటిమీటర్లు దూరంతో నాటుకోవాలన్నారు. 40 నుంచి 50 రోజుల నారును నాటేటప్పుడు సాలుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటిమీటర్లు స్థలాన్ని వదులుకోవాలన్నారు. ముదిరిన నారు నాటేటప్పుడు నారు పిలకలు ఎక్కువగా నాటాలి. కుదురుకు 4 లేదా 5 మొక్కల చొప్పున నాటు వేసుకోవాలి.
రెట్టింపుతో ఎరువుల వాడకం
ముదురు నారు పొలానికి రెండు దఫాలుగా మాత్రమే ఎరువులు వేయాలి. అది కూడా రెట్టింపుతో వాడాలి. ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువు అధికంగా వాడాలి, 70 శాతం దమ్ము దశలో 30 శాతం అంకుర దశలో వాడాలి. భాస్వరం ఎరువు 50 శాతం పొటాష్‌తో ఎరువుతో కలిపి మొదటిసారి దమ్ములో వేయాలి. ఇలా చేయడం వలన పిలకలు తొందరగా వేసి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మొదటి దఫా (నాటు వేసే సమయంలో) 50 కేజీల యూరియా, 50 కేజీల డీఏపీ, 15 కేజీల పొటాష్ వేస్తే సరిపోతుంది. ఇలా చేయడంతో దిగుబడి తగ్గకుండా ఉంటుంది.
వరినాటు సమయంలో 2 మీటర్ల తర్వాత 20 సెంటిమీటర్ల చొప్పున తూర్పు, పడమరలుగా కాలిబాటలు వదలడం మంచిది. దీంతో పంటకు గాలి బాగా తగులుతుంది. పైగా తెగుళ్లు సోకకుండా ఉంటుంది.
జిల్లాలో వరి సాగు
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 55 వేల ఎకరాల్లో పంట సాగు చేపడుతున్నట్లు తెలిపారు. గతేడాది 80 వేల ఎకరాల్లో పంట సాగు జరిగింది. కానీ ఈ ఏడాది వరిసాగు 55 వేల ఎకరాల్లో జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.