వర్షం.. నష్టం

అలంపూర్/కొల్లాపూర్/ పెద్దకొత్తపల్లి/కోడేరు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్షం కురవడంతోపాటు ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంతోపాటు నర్సాయిపల్లి, ఎత్తం, కొండ్రావుపల్లి తదితర గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఎత్తం గ్రామానికి చెందిన మల్లేశ్‌కు చెందిన 12 ఎకరాల మామిడి తోటలో ఈదురుగాలులకు 10 టన్నుల మామిడి కాయలు నేలరాలగా.. సుమారు పది చెట్లు విరిగిపోయాయి. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు. కొల్లాపూర్‌లో 10.6 మి.మీ., వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
● పెద్దకొత్తపల్లి మండల కేంద్రంతోపాటు బాచారం, ముష్టిపల్లి, ఆదిరాల, మరికల్, చంద్రకల్ గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఈ ఒక్క మండలంలోనే సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి తోటలు, 200 ఎకరాల్లో వేరుశనగ, 100 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. మండల కేంద్రంలో వెంకట్‌రెడ్డి, ఎల్లె కృష్ణయ్య పొలాల్లో 4 విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. ఆయా గ్రామాల్లో మామిడి తోటలను కొల్లాపూర్ ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మణ్ శుక్రవారం పరిశీలించారు.
● గద్వాల మార్కెట్, అలంపూర్‌లో పప్పుశనగ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షార్పణమైంది. గద్వాలలో ధాన్యం రైతుల కళ్లముందే కొట్టుకుపోతుంటే కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. అలంపూర్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో విక్రయించేందుకు పంటపొలాల్లోని కల్లాల్లో మిర్చి తడిసిపోయింది.
● అలంపూర్ మండలం క్యాతూర్ పీఏసీఎస్ అధికారులు పప్పుశనగ కొనుగోలు కేంద్రంలో పప్పుశనగ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయింది. అధికారులు కనీసం గన్నీబ్యాగులు కూడా ఇవ్వలేదని తక్కశీల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
● గట్టులో పొగాకు రైతులతోపాటు మామిడి రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం పొగాకు పంట చేతికందగా.. ఆకులను తోరణాలుగా పేర్చి పొలాల్లో ఆరబెట్టుకున్నారు. ఆరుబయట ఆరబెట్టిన పొగాకు అకాల వర్షం కారణంగా దెబ్బతింది.
● మానవపాడు మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి 13.8 మి.మీ., వర్షపాతం నమోదైందని తహసీల్దార్ యాదగిరి తెలిపారు.
● ఉండవెల్లిలో విద్యుత్ స్తంభాలు, హరితహారం మొక్కలు, వృక్షాలు నేలకొరిగాయి. మండలంలో 20 మి.మీ., వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. మొక్కజొన్న పంట దాదాపు 15 ఎకరాల్లో నేలమట్టమైంది. పప్పుశనగ పంట కోసి పెట్టడంతో తడిసి నేలపాలైంది.
నాగర్‌కర్నూల్, గద్వాలజిల్లాల్లోఅపారనష్టం మిగిల్చిన వాన
కొల్లాపూర్‌లో నేలరాలినమామిడి కాయలు
నడిగడ్డలో వేరుశనగ, మిర్చి,పప్పుశనగకు భారీ దెబ్బ
మార్కెట్లలో రైతుల కళ్లెదుటేకొట్టుకుపోయిన ధాన్యం