మహబూబాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌

Nov 21 2026 2:38 AM | Updated on Nov 21 2026 2:38 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

7

సాక్షి, మహబూబాబాద్‌: మానుకోట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల మధ్య రగిలిన చిచ్చు ఆరడం లేదు. ఆధిపత్యం కోసం ఒకరు.. పనులు, పంపకాల కోసం మరొకరు అన్నట్లు సొంత పార్టీ(కాంగ్రెస్‌) కౌన్సిలర్లతో చైర్‌పర్సన్‌కు సమన్వయం కుదరడం లేదని బహిర్గతమైంది. తాను ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టి చైర్‌పర్సన్‌ అయితే.. కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు.. పదవికి రాజీనామా చేస్తా అని చైర్‌పర్సన్‌ తన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా తమ వార్డుల్లో తమను కాదని చైర్‌పర్సన్‌ పెత్తనం చేయడం ఇబ్బందిగా ఉందని.. తమను కలుపుకొనిపోవడం లేదని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య అంతరం పెరిగి చివరకు ఎమ్మెల్యే మురళీ నాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు ఉమా వద్దకు పంచాయితీ చేరినట్లు అధికార పార్టీలో చర్చ జరుగుతోంది.

ఆధిపత్యం కోసం..

పనులు, పంపకాలతోపాటు ఆధిపత్యం కోసం చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు పోటీపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో పనిచేసిన చైర్మన్లు అన్ని వార్డుల్లో పనులు చేయించడం, అక్కడ జరిగే కార్యక్రమాలకు పిలిచి గౌరవించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చైర్‌పర్సన్‌ ఆవేదనతో ఉన్నట్లు చర్చ. అయితే డబ్బులు ఖర్చుపెట్టి పార్టీకోసం పనిచేసి కౌన్సిలర్లుగా గెలిచామని, పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు పైసా తీసుకోకుండా చైర్‌పర్సన్‌కు మద్దతు తెలిపామని పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు. అయితే ఇంత కష్టపడ్డా.. చైర్‌పర్సన్‌ తమ వార్డుల్లో పెత్తనం చెలాయించడం, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వార్డుల్లోని కార్యకర్తలు, నాయకులను కలవడం, వారి ఇళ్లల్లో శుభకార్యాలకు రావడం, రెండు వర్గాలుగా విభజిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు అంటున్నారు. ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే చైర్‌పర్సన్‌ అనుమతులు ఇచ్చుకుంటూ పోతున్నారని, తమ అనుచరుల వద్దకు అధికారులను పంపించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ.. భవనాలకు కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని కౌన్సిలర్లు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అదే విధంగా మున్సిపల్‌ నిధుల నుంచి ప్రతీ వార్డుకు రూ. 5లక్షలు ఇవ్వగా వాటిని త్వరగా ఖర్చుచేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా.. కాంట్రాక్టర్లకు పనుల కేటాయింపుల్లో జోక్యం చేసుకోవడం, ఇందుకు అధికారులను నిందించడంతో కార్యాలయం కూడా రెండుగా చీలిపోయిందనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ..

తనకు కౌన్సిలర్లతో ఇబ్బంది ఏర్పడుతుందని చైర్‌పర్సన్‌.. తమకు చైర్‌పర్సన్‌తో కుదరడం లేదని కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు ఎమ్మెల్యే మురళీ నాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు ఉమాకు ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. పాలక వర్గం ఏర్పడి పట్టుమని పది నెలలు గడవకముందే.. పంచాయితీలు వస్తే ప్రతిపక్ష పార్టీలు నవ్వుకుంటున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షురాలి ఎదుట వాపోయినట్లు సమాచారం. దీంతో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్‌ కౌన్సిలర్లను పిలిపించుకొని ఒక్కొక్కరితో సుదీర్ఘంగా చర్చ జరిపినట్లు తెలిసింది. అందరూ సమన్వంతో పనిచేసుకోవాలని, అందరి లక్ష్యం మానుకోటను అభివృద్ధి పథంలో నడిపించడం, కాంగ్రెస్‌ పార్టీకి గౌరవం తెచ్చేలా వ్యవహరించాలని సూచించినట్లు తెలిసింది. ఇదే విషయం చైర్‌పర్సన్‌కు కూడా చెప్పి తమ విషయాల్లో జోక్యం తగ్గించాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరినట్లు తెలిసింది.

మానుకోట మున్సిపాలిటీలో ముసలం

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో విభేదాలు

ఒకరిపై మరొకరు విమర్శలు

పనులు, పంపకాల్లో తేడాలు, ఆధిపత్య ధోరణి

ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షురాలి వద్దకు పంచాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement