● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: పిల్లల హక్కుల పరిరక్షణ, వారి ఉజ్వల భవిష్యత్‌కు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, వారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పిల్లలతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
కలెక్టరేట్‌లో శుక్రవారం స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరగనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్ లోగో, వాల్ పోస్టర్‌ను కలెక్టర్ స్నేహశబరీష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సీపీఓ శ్రీనివాసరావు, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఓలేటి జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జాగ్రత్తగా నమోదు చేయించాలి..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల్లో వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. స్థానిక మున్సి పల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ బీమా పథకం నమోదు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, కమిషనర్ వినోద్‌కుమార్, సిస్టమ్ మేనేజర్ అమర్ తదితరులు పాల్గొన్నారు.


