సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ విధుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెంచేందుకు ప్రవేశపెట్టిన ‘మీ ప్రమాణం’ పోర్టల్‌లో వ్యక్తిగత హాజరు నమోదు చేయని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. డీఎంహెచ్‌ఓ, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో విధులకు సంబంధించిన హాజరును నిర్దేశిత పోర్టల్‌లో నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన వారికి నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో మొత్తం 397 మంది ఈ జాబితాలో ఉన్నారు.
ఆదేశించినా.. నమోదు చేయలే!
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ‘మీ ప్రమాణం’ పోర్టల్‌లో వ్యక్తిగత హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించి, నివేదిక సమర్పించాలని ఈ నెల 9న జారీ చేసిన మెమోలో రాష్ట్ర కుటుంబ, ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించింది. అయినప్పటికీ గురువారం నాటికి పలువురు సిబ్బంది హాజరు నమోదు చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, హాజరు నమోదు చేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
జేఎస్ భూపాలపల్లిలో అత్యధికం..
ఉమ్మడి వరంగల్‌లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 107 మంది హాజరు నమోదు చేయలేదు. మహబూబాబాద్‌లో 93 మంది, హనుమకొండలో 82 మంది, వరంగల్‌లో 67 మంది, జనగామలో 25 మంది, ములుగు జిల్లాలో 23 మంది ఉన్నారు. కాగా పోర్టల్‌లో హాజరు ఎందుకు నమోదు చేయలేదు? సాంకేతిక సమస్యల వల్లనా? లేక విధుల్లో నిర్లక్ష్యమా? అనే అంశాలు నోటీసులకు సిబ్బంది ఇచ్చే సమాధానాలతో తేలనున్నాయి.
జిల్లా డీఎంహెచ్‌ఓ యూపీహెచ్‌సీ పీహెచ్‌సీ
హనుమకొండ 11 18 53
వరంగల్ 08 39 20
జనగామ 00 02 23
భూపాలపల్లి 19 07 81
మహబూబాబాద్ 23 03 67
ములుగు 03 00 20
డీఎంహెచ్‌ఓ యూపీహెచ్‌సీ పీహెచ్‌సీ
ఉమ్మడి జిల్లాలో మొత్తం షోకాజ్‌లు
పోర్టల్‌లో హాజరు నమోదు చేయని 397 మందికి షోకాజ్‌లు
ఆరు జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఉన్నతాధికారుల చర్యలు
అత్యధికంగా భూపాలపల్లిలో 107 మంది.. ఆ తర్వాత మహబూబాబాద్‌లో 93 మంది
పలుమార్లు ఆదేశించినా మారని తీరు.. వివరణ ఇవ్వాలని ‘కమిషనర్’ ఆదేశం


