మిల్లర్ల తర్జనభర్జన | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల తర్జనభర్జన

Nov 16 2026 1:02 AM | Updated on Nov 16 2026 1:02 AM

సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకొని సకాలంలో సీఎంఆర్‌ పెట్టకుండా పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ 2026–27 సంవత్సరానికి కొత్తగా రూపొందించిన ఒప్పందంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. ఈ నిబంధనల ప్రకారం సీఎంఆర్‌ పెట్టడం కష్టంగా ఉంటుందని, ఈ వానాకాలంలో ధాన్యం తీసుకోవాలా.. వద్దా అని మిల్లర్లు తర్జనభర్జన పడుతున్నారు.

కొత్త నిబంధనలతో బెంబేలు..

గతంలో మాదిరిగా కాకుండా ఈ సీజన్‌ సీఎంఆర్‌ ధాన్యానికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు కఠినంగా ఉన్నాయని మిల్లర్లు చెబుతున్నారు. సీఎంఆర్‌ సకాలంలో అప్పగించకపోయినా, ధాన్యం నిల్వల్లో తేడాలు వచ్చినా, పక్కదారి పట్టించినా మిల్లర్లతోపాటు గ్యారంటీదారులపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించింది. రైస్‌ మిల్లర్ల నుంచి ధాన్యం విలువకు సమానమైన చెక్కులను బ్యాంకు ధ్రువీకరణతో తీసుకోవాలని, మిల్లింగ్‌కు కేటాయించిన ధాన్యం విలువపై రైస్‌ మిల్లర్‌ 5రెట్లు అసలు సాల్వెన్సీ సర్టిఫికెట్‌ సమర్పించాలని అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ధాన్యం ఇవ్వాలంటే ఇద్దరు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన, డిఫాల్ట్‌ చరిత్రలేని ఇతర రైస్‌ మిల్లర్ల నుంచి గ్యారంటీ తీసుకోవాలనే నిబంధన కూడా విధించింది. గతంలో డిఫాల్ట్‌ మిల్లర్లు పూర్తి బకాయిలు, జరిమానాలు చెల్లించకపోతే ధాన్యం కేటాయించబోమని స్పష్టం చేసింది. లీజుకు తీసుకున్న మిల్లులైతే కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర ఈ–బ్యాంకు గ్యా రంటీ ఇవ్వాలని, మిల్లర్‌ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలు, వాటిపై ఉన్న తనఖా వివరా లు కూడా వెల్లడించాలని ప్రభుత్వం సూచించింది.

ముక్కుపిండి బకాయిల వసూళ్లు..

గతంలో మాదిరిగా కాకుండా సీఎంఆర్‌ బకాయిలను ముక్కుపిండి వసూళ్లు చేసే విధంగా అగ్రిమెంట్లు తీసుకుంటున్నారు. సీఎంఆర్‌ సకాలంలో అందించని మిల్లర్ల నుంచి ధాన్యం విలువను వసూలు చేయడంతోపాటు 25శాతం జరిమానా, ఏడాదికి 12 శాతం వడ్డీ విధిస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ జరిమానా మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద భూమి శిస్తు బకాయిగా వసూలు చేసే అధికారం పౌరసరఫరాల సంస్థకు కల్పించింది. సకాలంలో సీఎంఆర్‌ పెట్టకపోయినా.. ధాన్యం నిల్వ లేకపోతే జమానత్‌దారుల నుంచి రికవరీ చేసుకునేందుకు వీలుగా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని ప్రైవేటు ధాన్యంతో కలిపి వ్యాపారం చేయడం, ఇతర సీజన్‌ ధాన్యాన్ని కలపడం, పీడీఎస్‌ బియ్యాన్ని కొనడం, ఆ బియ్యాన్ని సీఎంఆర్‌ కింద అప్పగించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వం ఒప్పంద పత్రంలో స్పష్టం చేసింది.

కొత్త సీఎంఆర్‌ నిబంధనలపై

మల్లగుల్లాలు

నిబంధనలు సడలిస్తేనే ధాన్యం

తీసుకుంటామంటున్న మిల్లర్లు

నిబంధనలు పాటించాలని

అధికారుల ఆదేశాలు

మిల్లర్లకు కాకుండా ధాన్యం

ఎగుమతిపై చర్చ

మిల్లర్ల ఆందోళన..

రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ శాఖ రూపొందించిన కొత్త అగ్రిమెంట్‌ ప్రకారం ధాన్యం తీసుకోవాలా.. వద్దా అనే మీమాసంలో జిల్లా రైస్‌ మిల్లర్లు ఉన్నారు. ఇటీవల కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులు మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు చెప్పిన నిబంధనలపై పలువురు మిల్లర్లు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. రవీ సీజన్‌లో 70మిల్లులకు పైగా ధాన్యం దిగుమతి చేసుకోగా.. ఇందులో సగం మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు సీఎంఆర్‌ పెట్టారు. దీంతో తామేమీ డిఫార్టర్లం కాదు కదా..మాకు ఇన్ని ఆంక్షలు ఎందుకని పలువురు మిల్లర్లు అడుగుతున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అగ్రిమెంట్లు, బ్యాంక్‌ గ్యారంటీలు తీసుకోవాల్సిందే అని తామేమీ చేయలేమని అధికారులు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు బదిలీల్లో భాగంగా ఇప్పటి వరకు సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌గా ఉన్న స్టీఫెన్‌ రవీంద్ర బదిలీ కావడం, ఆయన స్థానంలో నాగిరెడ్డి రావడంతో మళ్లీ ఏం జరుగుతుందో.. తర్వాతనే ఆలోచిస్తామని మిల్లర్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement