ఇంతికి.. ఇంటి తాళం! | - | Sakshi
Sakshi News home page

ఇంతికి.. ఇంటి తాళం!

Nov 16 2026 1:02 AM | Updated on Nov 16 2026 1:02 AM

తొర్రూరు: పేదల సొంతింటి కల నెరవేరుస్తూ ప్రభుత్వం అడుగులు వేసింది. గత సర్కారు హయాంలో తొర్రూరు పట్టణంలోని దుబ్బతండా సమీపంలో 280 ఇళ్లు నిర్మించినప్పటికీ పంపిణీ జరగలేదు. పలు పనులు అసంపూర్తిగా మిగలడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి చొరవ తీసుకున్నారు. ఇటీవల గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర ఎండీ వీపీ గౌతమ్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్లను సందర్శించి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చారు. దీంతో అధికారులు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అర్హుల గుర్తింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం డివిజన్‌ కేంద్రంలోని బీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపు కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, అడిషనల్‌ కలెక్టర్‌ పురుషోత్తంల సమక్షంలో డ్రా పద్ధతిలో ఇళ్ల కేటాయింపు చేపట్టారు. గతంలోనే అర్హుల ఎంపిక జరగగా వారికి లక్కీ డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయించారు.

పారదర్శకంగా ఇళ్ల పంపిణీ: కలెక్టర్‌

పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పూర్తి పారదర్శకతతో చేపట్టామని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. లక్కీ డ్రా అనంతరం దుబ్బతండా సమీపంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ..పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇళ్లు అందిస్తుందన్నారు. లబ్ధిదారుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే అభ్యంతరాలు తెలియజేస్తే విచారణ చేపట్టి ఎప్పుడైనా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తూనం శ్రావణ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ సోమ రజిని, కౌన్సిలర్లు ముద్దసాని సురేష్‌, బసనబోయిన ఐలమ్మ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, కమిషనర్‌ వి.శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఆందోళన..

డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, జాబితాపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. లక్కీ డ్రా నిర్వహిస్తున్న పట్టణంలోని బీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన తెలిపారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హయాంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 280 డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఇళ్ల పంపిణీ చేపట్టలేదని, అనంతరం ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత జాబితాను రద్దు చేసిందన్నారు. అర్హులను పక్కనబెట్టి అధికార పార్టీకి అనుకూలమైన వారికి ఇళ్లు కేటాయించారన్నారు. అర్హులకు కేటాయించే వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆందోళనలో మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్‌, కౌన్సిలర్లు కర్నె నాగరాజు, పేర్ల జంపన్న, తూర్పాటి రవి, మాడ్గుల భవానిలత, భూసాని జయమ్మ, ధరావత్‌ పద్మ పాల్గొన్నారు.

నేడు పట్టాల పంపిణీ..

పట్టణంలోని దుబ్బతండా సమీపంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్ల సమీపంలో నేడు (సోమవారం) లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్‌, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పేదలకు పట్టాలు అందించనున్నారు. ఇళ్లు రానివారు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

లక్కీ డ్రా పద్ధతిలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపు

కలెక్టర్‌ సమక్షంలో 280 ఇళ్ల ప్రక్రియ పూర్తి

నేడు తొర్రూరులో పట్టాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement