● బీర్సాముండా జయంతిలో జాతీయ
ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్
కొత్తగూడ: ఎందరో భారతీయ వీరుల చరిత్ర ఇంకా ప్రజల్లోకి చేరలేదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన బిర్సాముండా జయంతి వేడుకల్లో హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత్‌పై దండయాత్ర చేసి కొల్లగొట్టిన ఔరంగజేబు లాంటి వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చారని, 25 ఏళ్ల వయసులో ఆంగ్లేయులను గజగజలాడించిన ఆదివాసీ మొదటి ఉద్యమకారుడు బిర్సాముండా లాంటి మహోన్నత వ్యక్తుల చరిత్రను తెలియనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత యోధులకు గుర్తింపు ఇవ్వడమే కాకుండా పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి చదువుపై శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రతీ ఆదివారం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఐటీడీఎ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోకు సూచించారు. ఒకప్పుడు నక్సలైట్ల అవసరం ఉండేదని.. ఇప్పుడు దోపిడీ లేని అభివృద్ధి జరుగుతుండడంతో వారి అవసరం తీరిందని అన్నారు. అందుకే నక్సలైట్లను జన జీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నుంచి అనేక మంది గొత్తికోయలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి అడవుల్లో ఎలాంటి వసతులు లేకుండా జీవిస్తున్నారని, వారిని తిరిగి వారి గ్రామాలకు పంపేందుకు, అలా వెళ్లడం ఇష్టం లేని వారికి తగిన వసతులు కల్పించేందుకు ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ పాఠశాలల చిన్నారుల కోయ, గిరిజన సంప్రదాయాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు హుస్సేన్‌నాయక్ నగదు బహుమతులు అందజేశారు. స్థానిక సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ, డీఎస్పీ తిరుపతిరావు, ఏడీఏ శ్రీనివాస్‌నాయక్, వివిధశాఖల అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


