మహబూబాబాద్: జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆటలు, పాటలు, క్రీడలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఈసారి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ ఆదేశాలతో వారోత్సవాల్లో భాగంగా పిల్లల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. నేటి(సోమవారం) సాధారణ ప్రజావాణిలోనే దీనిని కూడా నిర్వహిస్తారు. ఈమేరకు ప్రత్యేకత ఉండే విధంగా హెల్ప్ డెస్క్, బ్యానర్, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో..
కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్వోతో పాటు అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొంటారు. అది సాధారణంగా జరుగుతుంది. అయితే నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలోనే సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పిల్లల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నారు. ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీషతో పాటు సంబంధిత అధికారులు ఉంటారు.
18 సంవత్సరాలలోపు పిల్లల కోసం..
కమిషనర్ విడుదల చేసిన సర్క్యులర్‌లో బాలల హక్కులు, రక్షణ, బాధ్యత, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు, వినతులను ప్రజావాణిలో స్వీకరిస్తారు. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకొస్తారు. జిల్లా అధికారులు వినతులు తీసుకుని వెంటనే పరిష్కారం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల ప్రజావాణిలో కలెక్టర్‌కు నేరుగా వినతులు ఇవ్వనున్నారు. పిల్లల సమస్యలను కలెక్టర్ నేరుగా విని సంబంధిత అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా ప్రచారం..
సంబంధిత శాఖల అధికారులు వారి సెల్‌ఫోన్ వాట్సాప్‌లో పిల్లల ప్రజావాణి స్టేటస్ పెట్టుకోవాలని ఆదేశాలు వచ్చాయని సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రూపుల్లో పోస్టు చేయడంతో పాటు పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం అందేలా చర్యలు తీసుకున్నారు.
తెలియజేసే అంశాలు..
ఆరోగ్య సంబంధిత సమస్యలు, పాఠశాల ప్రవేశాలు, సదుపాయాలు, పాఠశాలలో భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా వసతులు, పాఠశాలకు రవాణా, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, స్కాలర్‌షిప్‌లు, తదితర వాటిపై వినతులు ఇవ్వవచ్చు.
పిల్లల గొంతుకు వేదికగా ప్రజావాణి
వారోత్సవాల్లో భాగంగా పిల్లల గొంతుకు వేదికగా పిల్లల ప్రజావాణి కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో ఉంటుంది. పిల్లల హక్కులు, సంక్షేమం, భద్రతపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశం.ఈ కార్యక్రమాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి.
– శిరీష, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ
వారోత్సవాల్లో భాగంగా గ్రీవెన్స్
కమిషనర్ ఆదేశాలతో
మొట్టమొదటిసారిగా కార్యక్రమం
18ఏళ్ల లోపు పిల్లల సమస్యలు
సత్వర పరిష్కారమే లక్ష్యం
వాట్సాప్ స్టేటస్, గ్రూపుల్లో పోస్టింగ్, పత్రికల ద్వారా ప్రచారం


