● మార్కెట్లో రైతుల ఆందోళన
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధరను భారీగా తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మార్కెట్కు 3,991 బస్తాల ధాన్యం అమ్మకానికి రాగా, వ్యాపారులు ఇ–నామ్ టెండర్లు వేశారు. అయితే పలువురు రైతులకు చెందిన సన్నరకం ధాన్యం క్వింటా ధర రూ.2,500 వరకు పలికింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా పచ్చి వడ్లను రూ.3వేల వరకు ధరపెట్టి కొనుగోలు చేస్తున్నారని, మార్కెట్లో ఒక్కసారిగా ధర తగ్గించడం ఏమిటని ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకుని కావాలనే తమ ధాన్యానికి తక్కువ ధర పెట్టారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా తేమ ఎక్కువ ఉండడంతోనే ధర తక్కువ పడిందని సదరు వ్యాపారి చెప్పుకొచ్చారు. తేమ సాకు చూపుతూ తమ ధాన్యానికి ధరను అమాంతం తగ్గిస్తారా అంటూ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. బుధవారం మరోసారి టెండర్ వేయిస్తామని మార్కెట్ అధికారులు సర్దిచెప్పడంతో రైతులు శాంతించారు.


